ఎన్టీఆర్ జీవన విధానం భగవంతుడి మార్గంః బాలకృష్ణ

ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఆయన ఘాట్ వద్ద నివాళి అర్పించిన కుటుంబ సభ్యులు

Balakrishna family members paid tribute at the Ghat on the occasion of NTR’s death

హైదరాబాద్ః పేదల సంక్షేమం కోసం దివంగత ఎన్టీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలను తీసుకొచ్చారని సినీ నటుడు, టిడిపి ఎమ్మెల్యే బాలకృష్ణ అన్నారు. ఎన్టీఆర్ అంటే నవరసాలకు అలంకారమని చెప్పారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద బాలకృష్ణ తన కుటుంబ సభ్యులతో కలిసి నివాళి అర్పించారు. వీరిలో నందమూరి రామకృష్ణ, సుహాసిని తదితరులు ఉన్నారు.

ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ… ఎన్టీఆర్ 28వ వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళి అర్పించడానికి వచ్చామని చెప్పారు. ఒక పరమార్థం కోసం, సమాజాన్ని ఉద్ధరించడం కోసం కొందరు పుడతారని, వారికి మరణం ఉండదని… అలాంటి వ్యక్తుల్లో ఎన్టీఆర్ ఒకరని చెప్పారు. ఆయన జీవన విధానమే భగవంతుడి మార్గమని అన్నారు. అన్ని వర్గాలకు ఆయన దేవుడని తెలిపారు. ఆయన రగిలే ఒక అగ్నికణమని చెప్పారు.

మహనీయమైన జన్మను పొందిన ఎన్టీఆర్ కు మరణం లేదని బాలయ్య అన్నారు. నటుడిగా అనితరసాధ్యమైన ఎన్నో పాత్రలను పోషించారని చెప్పారు. అలాంటి నటధీరుడు ఎక్కడా కానరాడని అన్నారు. సినిమాలే కాకుండా, టీడీపీని స్థాపించి, ప్రతి తెలుగు బిడ్డకు రాజకీయాలంటే ఏమిటో నేర్పిన నాయకుడని కొనియాడారు. రాజకీయాల పట్ల ప్రజల్లో ఒక అవగాహన కల్పించారని చెప్పారు.

ఆయన ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలను ఇప్పటికీ ఎందరో అమలు చేస్తున్నారని బాలయ్య అన్నారు. ప్రజలకు అన్నం పెట్టిన నాన్న, ఆడపడుచులకు ఆర్థిక స్వాతంత్ర్యం కల్పించిన అన్న, యువత జీవితాలలో వెలుగులు నింపిన నాన్న ఎన్టీఆర్ అని చెప్పారు. విప్లవాత్మక సామాజిక మార్పులను ఆయన తీసుకొచ్చారని తెలిపారు. తెలంగాణలో పట్వారీ వ్యవస్థను రద్దు చేయడం, తాలూకాలను మండలాలుగా చేయడం, సహకార వ్యవస్థ ద్వారా రైతులకు మేలు చేయడం, మహిళా విశ్వవిద్యాలయం, గురుకుల విద్యా విధానం, సంక్షేమ హాస్టళ్లు, జోగిని, దేవదాసి వ్యవస్థలను రద్దు చేయడం ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయని అన్నారు.

నేషనల్ ఫ్రంట్ ఛైర్మన్ గా ఉన్నప్పుడు దేశ వ్యాప్తంగా 11 లక్షల మంది రైతులకు భూమి శిస్తును రద్దు చేయించారని బాలయ్య చెప్పారు. ఎన్టీఆర్ చేసిన సేవలు మరువలేనివని అన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల వారు ఈరోజు ఆయన వర్ధంతిని జరుపుకుంటున్నారని చెప్పారు. ఆయన స్థాపించిన టిడిపికి మరింత వైభవం తీసుకొచ్చేలా అందరం శ్రమిద్దామని పిలుపునిచ్చారు.