పార్టీ మారాలనే ఆలోచన ఉంటే నేనే ప్రకటిస్తా : కోమటిరెడ్డి

మోడీని, కేంద్ర మంత్రులను కలుస్తుండటం వల్లే ఈ ప్రచారం జరుగుతోంది.. కోమటిరెడ్డి

i-am-not-changing-party-says-komatireddy

హైదరాబాద్ః కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేయబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. దీనిపై కోమటిరెడ్డి స్పందిస్తూ ఆ వార్తలను కొట్టిపడేశారు. నిరాధారమైన వార్తలను ప్రచారం చేస్తూ తనను, తనను నమ్ముకున్న వారిని అయోమయంలో పడేయవద్దని హితవు పలికారు. తాను పార్టీ మారుతున్నాననే వార్తలను తానే ఖండించాల్సి రావడం బాధాకరంగా ఉందని చెప్పారు. ఒకవేళ పార్టీ మారాలనే ఆలోచన ఉంటే తనకు పీసీసీ పదవి రాకముందే మారేవాడినని తెలిపారు. పార్టీ మారాలనే ఆలోచన ఉంటే తాను ఆ విషయాన్ని ప్రకటిస్తానని చెప్పారు.

గతంలో కాంగ్రెస్ అధిష్ఠానంపై తాను కొన్ని కామెంట్లు చేసిన సంగతి నిజమేనని… అయితే సోనియాగాంధీ, రాహుల్ గాంధీలను కలిసిన తర్వాత తన మనసును మార్చుకున్నానని కోమటిరెడ్డి తెలిపారు. అభివృద్ధి కార్యక్రమాల కోసమే ప్రధాని మోడీని, కేంద్ర మంత్రులను తాను కలుస్తున్నానని చెప్పారు. వీరిని కలుస్తున్నందువల్లే తాను పార్టీ మారుతున్నాననే ప్రచారం జరుగుతోందని అన్నారు. ఎమ్మెల్యే, మంత్రి పదవులను వదిలేసి తెలంగాణ కోసం పోరాడిన చరిత్ర తనదని చెప్పారు. గెలిచే అభ్యర్థులకు పార్టీ టికెట్లను త్వరగా ఇవ్వాలని కోరారు. కర్ణాటక మాదిరే తెలంగాణలో కూడా అభ్యర్థులను త్వరగా ప్రకటించాలని చెప్పారు.