కేటీఆర్ సమక్షంలో టిఆర్ఎస్ లో చేరిన రాపోలు ఆనంద్ భాస్కర్

మాజీ ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్ బుధువారం మంత్రి కేటీఆర్ సమక్షంలో టిఆర్ఎస్ పార్టీ లో చేరారు. మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో బిజెపి పార్టీ కి వరుస షాకులు తగులుతున్నాయి. బిజెపి పార్టీ లో రీసెంట్ గా చేరిన నేతలతో పాటు కొంతకాలంగా ఉన్న నేతలు సైతం బిజెపి కి రాజీనామా చేసి టిఆర్ఎస్ పార్టీ లో చేరుతున్నారు. రీసెంట్ గా దాసోజు శ్రావణ్ , స్వామి గౌడ్ లు బిజెపి పార్టీకి రాజీనామా చేసి టిఆర్ఎస్ పార్టీ లో చేరగా..తాజాగా మాజీ ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్ కూడా బీజేపీకి గుడ్‌బై చెప్పి టిఆర్ఎస్ కండువా కప్పుకున్నారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాపోలు ఆనందభాస్కర్‌ను హృదయపూర్వకంగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నామన్నారు. రాపోలు సామాజిక స్పృహ కలిగిన విద్యావేత్త అని కొనియాడారు. చేనేత, పవర్‌లూమ్‌ కార్మికుల కోసం సీఎం కేసీఆర్‌ పలు పథాకాలు అమలు చేస్తున్నారని మంత్రి కేటీఆర్‌ చెప్పారు. వ్యవసాయ రంగం తర్వాత అత్యధికంగా ఉపాధి కల్పిస్తున్న రంగం చేనేత రంగమేనని ఆయన పేర్కొన్నారు. చేనేత రంగాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్రం ప్రయత్నిస్తున్నదని ఆరోపించారు. దేశంలో చాలామంది అద్భుత ప్రతిభ ఉన్న చేనేత కళాకారులు ఉన్నారని చెప్పారు. రాష్ట్రంలో నేతన్నకు చేయూత, చేనేత లక్ష్మి పేరుతో కార్మికులను ఆదుకుంటున్నామని తెలిపారు.

అంతకుముందు కేసీఆర్ తో ప్రగతి భవన్ లో రాపోలు భేటీ అయ్యారు. చేనేత రంగం అభివృద్ధికి, కార్మికుల సంక్షేమానికి కేసీఆర్ తీసుకుంటున్న చర్యలను ఆయన ప్రశంసించారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అద్భుతంగా ఉన్నాయని కొనియాడారు. బీఆర్ఎస్ తో జాతీయ రాజ‌కీయాల్లో కేసీఆర్ ప్రధాన పాత్ర వహించాలని రాపోలు ఆనంద్ భాస్కర్ కోరారు.