మధ్యప్రదేశ్ లో అమానవీయ ఘటన : బైక్ పై తల్లి శవాన్ని తీసుకెళ్లిన కుమారులు

మధ్యప్రదేశ్‌లోని సాగర్‌లో మరో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. నిన్నటికి నిన్న ఒకే సిరంజితో 30 మంది విద్యార్థులకు టీకాలు వేసిన ఘటన మీడియాలో చర్చకు దారితీయగా..ఈరోజు వైద్యుల నిర్లక్ష్యం కారణంగా బైక్ పై తల్లి శవాన్ని 80 కి.మీ తీసుకెళ్లిన ఘటన వైరల్ గా మారింది. ప్రభుత్వ మెడికల్ కళాశాలలో అంబులెన్సు సౌకర్యం లేకపోవడం… ప్రైవేటు వాహనాన్ని ఏర్పాటు చేసుకునే స్తోమత లేకపోవడం వల్ల ఆమె కుమారులిద్దరు తల్లి శవాన్ని బైక్ పైనే సొంతూరికి తీసుకెళ్లారు. ఈ ఘటన షాదోల్ జిల్లాలో జరిగింది.

వివరాల్లోకి వెళ్తే..

సుందర్ యాదవ్.. అస్వస్థతకు గురైన తన తల్లి జిల్లా ఆస్పత్రిలో చేర్చాడు. శనివారం రాత్రి ఆమె ఆరోగ్యం క్షీణించడం వల్ల మెరుగైన చికిత్స కోసం మెడికల్ కాలేజీకి తీసుకొచ్చారు. శనివారం అర్ధరాత్రి తర్వాత ఆమె ప్రాణాలు కోల్పోయింది. చనిపోయిన ఓ తల్లి మృతదేహానికి తీసుకెళ్లడానికి వాహనాన్ని సమకూర్చమని అడిగారు. వాహనం అందుబాటులో లేదని డాక్టర్స్ చెప్పారు. ప్రైవేటు వాహనానికి రూ. 5000 అడగడంతో.. అంత మొత్తాన్ని చెల్లించుకోలేని స్థితిలో ఉన్న ఆ కుమారులు.. చివరికి తన బైక్ పైనే.. ఆ తల్లి బాడీని తీసుకొని తమ సొంతూరైన గుడారుకు వెళ్లారు. రూ.100 పెట్టి చెక్క పలకలు కొని… దానిపై ఆ తల్లి మృతదేహాన్ని మోటారు సైకిల్ కు కట్టి తీసుకెళ్లే వీడియో ప్రస్తుతం వైరల్ గా మారడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. కాగా తమ తల్లి చికిత్స కోసం అనుపూర్ జిల్లా నుండి షాడోల్ మెడికల్ కాలేజీకి వచ్చామని… సరైన సమయంలో వైద్యం అందకపోవడంతోనే తమ తల్లి చనిపోయిందని వారు వాపోయారు. కనీసం ఆమె మృతదేహాన్ని తరలించడానికి కూడా వాహనాన్ని ఏర్పాటు చేయలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

దీనిపై ఆస్పత్రి యాజమాన్యం ఈ ఘటనపై స్పందించింది. మృతుడి కుటుంబ సభ్యులు వాహనం కోసం తమను సంప్రదించలేదని ఆస్పత్రి సూపరింటెండెంట్ నాగేంద్ర సింగ్ పేర్కొన్నారు. ‘మృతుల కుటుంబ సభ్యులు అడిగితే వాహనం ఏర్పాటు చేస్తాం. జిల్లా ఆస్పత్రి నుంచి లేదంటే ఇతర ప్రాంతాల నుంచి అంబులెన్సులు తెప్పిస్తాం. కానీ వారు వాహనం కోసం మమ్మల్ని అడగలేదు’ అని చెప్పుకొచ్చారు.