ప్రధాని మోడీకి సోనియా గాంధీ లేఖ

పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల అజెండా చెప్పాలన్న కాంగ్రెస్ మాజీ చీఫ్

Sonia Gandhi to write to PM Modi on Parl session agenda

న్యూఢిల్లీః పార్లమెంట్ సమావేశాలు జరిపే ముందు ప్రతిపక్షాలతో చర్చలు జరపడం ఆనవాయితీ.. కానీ ఎలాంటి చర్చలు జరపకుండానే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలకు పిలుపునిచ్చిందని సోనియా గాంధీ విమర్శించారు. ఈ ప్రత్యేక సమావేశాలకు అజెండా ఏంటనేది కూడా వెల్లడించలేదని చెప్పారు. దీనిపై ప్రధాని నరేంద్ర మోడీకి కాంగ్రెస్ పార్టీ మాజీ చీఫ్ సోనియా గాంధీ బుధవారం లేఖ రాశారు. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల అజెండాపై స్పష్టతనివ్వాలని అందులో కోరారు.

‘ప్రతిపక్షాలతో ఎలాంటి చర్చలు జరపకుండానే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలకు పిలుపునివ్వడం ఇదే మొదటిసారి. ఈ సమావేశాలలో చర్చించబోయే విషయాలపై మాకు ఎలాంటి సమాచారం లేదు. ఎందుకోసం సమావేశాలకు పిలుపునిచ్చారనే విషయంపై స్పష్టమైన ప్రకటన చేయండి’ అంటూ ప్రధాని మోడీని కోరారు. మరోవైపు విపక్ష ఇండియా కూటమి కూడా ప్రత్యేక సమావేశాల నిర్వహణపై కేంద్రం నుంచి స్పష్టత కోరుతోంది.

కాగా, ఈ నెల 18వ తేదీ నుంచి 22వ వరకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని కేంద్రం ప్రభుత్వం నిర్ణయించింది. ఐదు రోజుల పాటు పార్లమెంట్ కొత్త భవనంలో ఈ సమావేశాలు జరగనున్నాయి. అజెండాపై స్పష్టమైన ప్రకటన చేస్తామని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. ఇప్పటి వరకూ కేంద్రం ఎలాంటి వివరాలను వెల్లడించలేదు.. ఈ సమావేశాలలో జమిలి ఎన్నికలు, కొత్త చట్టాల రూపకల్పన, దేశం పేరు మార్చే తీర్మానం తదితర అంశాలపై చర్చించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.