తమిళనాడులో భారీ వర్షాలు.. నాలుగు జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌

heavy-rains-in-tamil-nadu-red-alert-in-4-districts

చెన్నైః తమిళనాడు రాష్ట్రంలో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేని వర్షాలతో లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. భారీ వర్షాల కారణంగా చెన్నై, తిరువళ్లూరు, రాణీపేట్‌, కాంచీపురం జిల్లాలకు అధికారులు రెడ్‌ అలర్ట్‌ ప్రకటించారు. చెన్నై సహా పలు జిల్లాలకు రానున్న రెండు మూడు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకావం ఉందని చెన్నై వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

నీలగిరి, కోయంబత్తూర్‌, కాంచీపురం, తిరుప్పూర్‌, విల్లుపురం, వెల్లూరు, సాలెం, నాగపట్నం, కాంచీపురం, చెంగల్పట్టు, తిరువళ్లూరు, చెన్నై తదితర ప్రాంతాల్లో శుక్రవారం భారీ వర్షం కురిసినట్లు అధికారులు తెలిపారు. ఏకధాటిగా కురుస్తున్న వానలకు ప్రజలు అల్లాడిపోతున్నారు. చెన్నైలో కురిసిన వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. డ్రైనేజీలు పొంగి పొర్లుతున్నాయి. పలు కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. పలుచోట్ల పంట పొలాలు నీట మునిగాయి. రోడ్లపై భారీగా వరదనీరు చేరడంతో ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడుతోంది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో చెన్నై సహా రాష్ట్రంలోని దాదాపు 26 జిల్లాలకు పాఠశాలలు, కళాశాలలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది.

రానున్న రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న చెన్నై వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. సముద్రంలో అలల ఉధృతి నేపథ్యంలో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరిస్తున్నారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/andhra-pradesh/