నేడు లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చ

కేంద్రం ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ బిల్లుపై నేడు బుధువారం లోక్ సభ లో చర్చ జరగనుంది. ఈ బిల్లుపై కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్ సోనియా గాంధీ మాట్లాడనున్నారు. కాంగ్రెస్ తరఫున ఆమె కీలక ప్రసంగం చేయనున్నారు. లోక్‌సభ, అసెంబ్లీలలో మహిళలకు 33శాతం కోటాను కేటాయించాలనే లక్ష్యంతో రూపొందించిన ఈ బిల్లును పార్లమెంటు ప్రత్యేక సమావేశాల సందర్భంగా మంగళవారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు.

కొత్త పార్లమెంట్ భవనంలో జరిగిన తొలి సమావేశంలో కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ మహిళా రిజర్వేషన్ బిల్లును దిగువ సభలో సమర్పించారు. ఈ బిల్లును 2008లో యూపీఏ ప్రభుత్వం రాజ్యసభలో ప్రవేశపెట్టి, 2010లో ఆమోదించింది. కానీ లోక్‌సభలో ఇది పెండింగ్ లోనే ఉంది. ఉదయం11 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు బిల్లుపై చర్చించనున్నారు. పార్లమెంటు ఆమోదం పొందితే మహిళా రిజర్వేషన్‌ బిల్లు చట్టంగా మారుతుందే తప్ప, అది అమల్లోకి వచ్చేది 2027 తర్వాతే. జనగణన, నియోజకవర్గాల పునర్విభజన పూర్తి చేసుకుని, పలు అడ్డంకులను దాటుకున్నాకే చట్టం కార్యరూపం దాలుస్తుంది. అదే జరిగితే ఇప్పుడు 82మంది మహిళా ఎంపీలున్న లోక్‌సభలో 181మంది అతివల ప్రాతినిధ్యాన్ని చూడొచ్చు.