ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ విద్యార్థి ఆత్మహత్య..

వైస్సార్ జిల్లా వేంపల్లె మండలం ఇడుపులపాయలో ఉన్న ట్రిపుల్‌ఐటీలో చదువుతున్న నేర్జాంపల్లె గంగారాం (21) మంగళవారం హాస్టల్‌ గదిలోని ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గది తలుపులు వేసి ఉండడంతో అనుమానించిన తోటి విద్యార్థులు కిటికీలోంచి చూసి షాకయ్యారు.

ఫ్యాన్‌కు వేలాడుతున్న గంగారాంను చూసి అధికారులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వెంటనే ట్రిపుల్ ఐటీకి చేరుకుని విద్యార్థి మృతదేహాన్ని కిందికి దించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉందని పోలీసులు పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.

లింగాల మండలం తేర్నాంపల్లె హరిజనవాడకు చెందిన నారాయణమ్మ, గంగాధర కూలీ పనులు చేస్తుంటారు. వీరికి గంగారాం, గౌరీకుమార్‌ కుమారులు. పెద్ద కుమారుడు గంగారాం ఇడుపులపాయ ట్రిపుల్‌ఐటీలో సివిల్‌ ఇంజినీరింగ్‌ మూడో సంవత్సరం చదువుతున్నాడు.