బ‌ల‌వంతంగా మత మార్పిడులు చేయిస్తున్నారు

వైస్సార్సీపీ తీరును చూస్తూ ఊరుకోం: విజయవాడ ధ‌ర్నాలో సోము వీర్రాజు

అమరావతి : ఏపీ ప్ర‌భుత్వంపై బీజేపీ ఏపీ అధ్య‌క్షుడు సోము వీర్రాజు మండిప‌డ్డారు. మ‌న‌ దేశాన్ని పాలించిన బ్రిటిష్ వారిది, సీఎం జగన్ ది ఒకటే మనస్తత్వమ‌ని వ్యాఖ్యానించారు. బ‌లవంత‌పు మ‌త‌మార్పిడులకు, గోవధ నిషేధంపై ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా విజయవాడలో నిర్వహించిన ధర్నాలో పాల్గొని సోము వీర్రాజు మీడియాతో మాట్లాడుతూ.. ప్ర‌జ‌ల‌తో బ‌ల‌వంతంగా మత మార్పిడులు చేయిస్తుంటే త‌మ పార్టీ చూస్తూ ఊరుకోబోద‌ని చెప్పారు.

మతం మారాలంటూ ప్రకాశం జిల్లా త్రిపురాంతకంలో ఎస్సీలపై వైస్సార్సీపీ నేతలు దాడి చేశారని ఆయ‌న చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో ర‌హ‌దారుల‌ అభివృద్ధికి క‌నీసం రూ.2 వేల కోట్లు కూడా కేటాయించలేని దుస్థితిలో స‌ర్కారు ఉంద‌ని ఆయ‌న విమ‌ర్శించారు. నవరత్నాలే తమ అభివృద్ధి అని వైస్సార్సీపీ ప్ర‌భుత్వం చెప్పుకుంటోంద‌ని, కేంద్ర ప్ర‌భుత్వం ఇప్ప‌టికే అటువంటి వంద రత్నాలను ప్రజలకు అందించిందని ఆయన వ్యాఖ్యానించారు. ఏపీకి కేంద్రం చేసిన సాయంపై వైస్సార్సీపీ నేత‌లు చ‌ర్చ‌కు రావాల‌ని స‌వాలు విసిరారు.

తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/news/business/