టీడీపీ సీనియర్ నేత కోటంరెడ్డిఫై దాడి..

ఇటీవల టీడీపీనేతల ఫై వరుస దాడులు జరుగుతున్నాయి. తాజాగా టీడీపీ సీనియర్ నేత కోటంరెడ్డి ఫై దాడి జరిగింది. కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డిని నాగవెంకట రాజశేఖర్ రెడ్డి అనే యువకుడు కారుతో ఢీ కొట్టాడు. నెల్లూరులోని తన ఇంటి వద్దే జరిగిన ఈ ఘటనలో కోటంరెడ్డికి గాయాలయ్యాయి. అనంతరం నిందితుడు నాగవెంకట రాజశేఖర్ రెడ్డి అక్కడ్నుంచి పరారయ్యాడు. ముందుగా ఇంట్లోకి వచ్చిన రాజశేఖర్‌రెడ్డి తన స్నేహితుడైన కోటంరెడ్డి కుమారుడితో గొడవకు దిగాడు. ఈ క్రమంలో కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి, అతడిని హెచ్చరించి బయటకు పంపేశాడు.

అనంతరం ఇంటి బయట ఉన్న శ్రీనివాసులరెడ్డిని కారుతో వచ్చి ఢీకొట్టి పారిపోయాడు. తీవ్ర గాయాలపాలైన కోటంరెడ్డిని కుటుంబ సభ్యులు అపోలో ఆస్పత్రిలో చేర్పించారు. దాదాపు రెండేళ్ల తర్వాత రాజశేఖర్‌రెడ్డి తమ ఇంటికొచ్చి గొడవకు దిగడంపై కోటంరెడ్డి కుటుంబీకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నిందితుడి కారు వెనుక వేరే కారు కూడా ఉందని, పక్కా ప్రణాళిక ప్రకారమే దాడి జరిగిందని ఆరోపిస్తున్నారు. అయితే, కోటంరెడ్డి కుమారుడికి, రాజశేఖర్‌రెడ్డికి మధ్య గొడవకు సంబంధించిన కారణాలు మాత్రం స్పష్టంగా తెలియడం లేదు. మరోవైపు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కోటం రెడ్డిని టీడీపీ అధినేత చంద్రబాబు ఫోన్‌లో పరామర్శించారు. ఘటనకు గల కారణాలను ఆయన కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు.