నేటి నుండి పదో తరగతి విద్యార్థులకు స్నాక్స్ అందించబోతున్న తెలంగాణ సర్కార్

పదో తరగతి విద్యార్థులకు నేటి నుండి స్నాక్స్ అందించబోతుంది తెలంగాణ సర్కార్. ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదువుతూ… స్పెషల్ క్లాసులకు హాజరవుతున్న విద్యార్థులకు స్నాక్స్ అందించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఈరోజు నుంచి ఏప్రిల్ ఒకటో తేదీ వరకు వాటిని ఇచ్చేందుకు ఏకంగా రూ.10 కోట్లు మంజూరు చేసింది. ఉదయం 8 గంటలకు స్కూలుకు వచ్చి ఇళ్లకు వెళ్లేసరికి విద్యార్థులకు రాత్రి 7 గంటల నుంచి 8 గంటలు అవుతున్న నేపథ్యంలో పాఠశాల విద్యాశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని 4,785 స్కూళ్లలో 1,89,791 మంది విద్యార్థులకు 34 రోజుల పాటు ఈ అల్పాహారం అందించనున్నారు.

ఈ అల్పాహారంలో పోషకాలుండేలా అధికారులు చర్యలు చేపట్టారు. ప్రొటీన్లు, ఐరన్‌, క్యాలరీలు అధికంగా ఉండే ఆహారాన్నే స్నాక్స్‌గా అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా గుడ్లు, శనగలు, పల్లీలు, బెల్లం, తాజా పండ్లను అందించనున్నారు. ఇందుకోసం పలు జిల్లాల్లో ప్రత్యేకంగా మెనూను రూపొందించారు. హనుమకొండ జిల్లాలోని 123 స్కూళ్లల్లో 3,258 మంది విద్యార్థులుండగా, రాగిజావ, శనగలు, గుడాలు, ఉప్మాతో పాటు వారంలో ఒకట్రెండు రోజులు ద్రాక్ష, సంత్రాలు, అరటిపండ్లు ఇవ్వాలని నిర్ణయించారు.