బీసీలు అంటేనే తెలుగుదేశం : అచ్చెన్నాయుడు

వైస్సార్సీపీ ప్రభుత్వంలో బీసీ మంత్రులు మాట్లాడే స్థితిలో కూడా లేరు..

అమరావతి : బీసీలు అంటే తెలుగుదేశం… తెలుగుదేశం అంటే బీసీలని టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. తలకిందులు తపస్సు చేసినా, ఎన్ని జన్మలెత్తినా సరే ఈ బంధాన్ని నీవు విడదీయలేవని ముఖ్యమంత్రి జగన్ ను ఉద్దేశించి అన్నారు. బీసీలను, టీడీపీని విడదీయడం ఎవరి తరం కాదని, జగన్ తరం కూడా కాదని చెప్పారు. బీసీలకు పదవులిచ్చామని సీఎం చెప్పుకుంటున్నారని… దేనికి ఈ పదవులని ఆయన ప్రశ్నించారు. పదవులిచ్చి, నోళ్లకు ప్లాస్టర్ వేయడానికా? అని ఎద్దేవా చేశారు.

ఈ రాష్ట్రాన్ని నలుగురు రెడ్లకు రాసి పెట్టారని… ఉత్తరాంధ్రని ఒకరికి, కోస్తాంధ్రను ఒకరికి, కృష్ణా, గుంటూరు జిల్లాలను ఒకరికి, రాయలసీమను ఒకరికి రాసిచ్చారని విమర్శించారు. రెడ్లంటే తనకు ఎలాంటి కోపం లేదని చెప్పారు. బీసీ సామాజికవర్గానికి చెందిన తాను టీడీపీ హయాంలో మంత్రిగా పని చేశానని… తాను, కేఈ కృష్ణమూర్తి, యనమల, కళా వెంకట్రావు, కొల్లు రవీంద్ర, పితాని సత్యనారాయణ వంటి బీసీ మంత్రులందరూ స్వతంత్రంగా పని చేశామని చెప్పారు. జగన్ పాలనలో బీసీ మంత్రులు కనీసం మాట్లాడే పరిస్థితిలోనైనా ఉన్నారా? అని ప్రశ్నించారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/