“సిరిసిల్ల రాజేశ్వరి” కన్నుమూత..

కాళ్లతో కవితలు రాసి ఎందరినో కదిలించిన సిరిసిల్ల రాజేశ్వరి ఇకలేదు. కరీంనగర్ జిల్లా సిరిసిల్లకు చెందిన ఒక నిరుపేద చేనేత కార్మిక కుటుంబానికి చెందిన బూర అనసూయ, సాంబయ్య దంపతులకు 1980లో జన్మించారు. ఆమె పుట్టుకతోనే వికలాంగురాలు. చేతులు వంకర్లుపోయి పని చేయవు. మాటలు రావు. తల నిలబడదు. ఎప్పుడూ వణికిపోతుంటుంది. చేతులు సరిగా పని చేయకపోవడంతో పట్టుదలతో కాళ్లతోనే రాయడం నేర్చుకొని స్థానిక నెహ్రూనగర్ పాఠశాలలో ఏడో తరగతి వరకు చదివింది.

తన వైకల్యాన్ని ఆత్మవిశ్వాసంతో అధిగమిస్తూ సాహిత్య లోకంలో తనకో స్థానాన్ని ఏర్పరచుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో రాజేశ్వరి తన కాళ్లను చేతులుగా చేసుకొని కవిత్వం రాస్తోంది. ఆమెలోని ఆ ఆత్మవిశ్వాసాన్ని సుద్దాల అశోక్ తేజ గుర్తించారు. ఆమె రాసిన కవితల్ని సుద్దాల ఫౌండేషన్ ద్వారా ‘సిరిసిల్ల రాజేశ్వరి కవితలు’ పేరుతో పుస్తక రూపంలోకి తెచ్చారు. ఈ పుస్తకాన్ని రవీంధ్రభారతిలో జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత డాక్టర్ సి.నారాయణరెడ్డి ఆవిష్కరించారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రాజేశ్వరి.. వైద్య చికిత్స పొందుతుంది. ఈక్రమంలోనే ఆరోగ్యం పూర్తిగా క్షీణించి బుధవారం మధ్యాహ్నం తుదిశ్వాస విడించింది. తన ఆత్మవిశ్వాసంతో.. మనోసంకల్పంతో.. విధిని ఎదురించి బ్రహ్మ రాసిన రాతను సైతం మార్చి తన కాళ్లతో తిరిగి రాసుకున్న సిరిసిల్ల రాజేశ్వరి మరణవార్త విని ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

అమ్మ మీద, తెలంగాణ ఉద్యమం మీద, నేత కార్మికుల మీద, వరకట్న వేధింపుల మీద, స్త్రీలపై జరుగుతున్న అత్యాచారాలపై కవిత్వం రాసింది రాజేశ్వరి. 1999లో కలం పట్టిన రాజేశ్వరి ఇప్పటి వరకు 350కిపైగా కవితలు రాసింది. పత్రికలకు ఎలా పంపాలో తెలియక తన వద్దనే దాచుకుంది. వై ఎస్ రాజశేఖరరెడ్డి జీవిత చరిత్రతో పాటు మూడు జీవిత చరిత్రలను కూడా రాసింది.

జనవరి 6 , 2015 న రవీంద్ర భారతిలో సుద్దాల ఫౌండేషన్ సుద్దాల హనుమంతు జానకమ్మ జానపద కళాపీఠం ఆధ్వరంలో సిరిసిల్ల రాజేశ్వరికి సుద్దాల హనుమంతు-జానకమ్మ పురస్కారాన్ని 2014 సంవత్సరానికిగానూ డా. సి .నారాయణ రెడ్డి చేతుల మీదుగా ప్రదానం చేసారు. ఆమె కవితల పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఇక రాజేశ్వరి పరిస్థితి తెలిసి.. తెలంగాణ సర్కారు.. రూ.10 లక్షలు ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయించారు. నెలనెలా రూ.10 వేల పెన్షన్ ఇస్తున్నారు. రాజేశ్వరికి ఒక డబుల్ బెడ్ రూం ఇళ్లును కూడా కేటాయించారు.