సొంత పార్టీ పైనే ఆనం రామనారాయణ రెడ్డి కీలక వ్యాఖ్యలు

ఈ మధ్య వైస్సార్సీపీ నేతలే..సొంత పార్టీ ఫై నిప్పులు చెరుగుతున్నారు. గడప గడపకు మన ప్రభుత్వం ద్వారా ప్రజల్లోకి వెళ్తుంటే సిగ్గేస్తుందని , ఏంచేశామని వారి దగ్గరికి వెళ్లాలని పబ్లిక్ గానే కొంతమంది నేతలు చెప్పడం జరిగింది. తాజాగా ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి సొంత పార్టీ పైనే కీలక వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు వైరల్ గా మారాయి.

నెల్లూరు జిల్లా రాపూరులో వాలంటీర్లు, కన్వీనర్ల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఆనం రామనారాయణ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..’రోడ్లులో గుంతలు కూడా పూడ్చలేకపోతున్నాం.. తాగడానికి నీళ్లు ఇవ్వలేకపోతున్నాం.. కేంద్ర ప్రభుత్వం జలజీవన మిషన్ కింద నిధులు ఇస్తారు. అప్పుడు నీళ్లు ఇస్తామని చెప్పుకోవాల్సి న పరిస్థితి వస్తుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తే.. మీరేం చేస్తున్నారని ప్రజలు అడుగుతున్నారని..వారి మాటలకు సిగ్గేస్తుందని ఆనం అన్నారు.

‘ఈ నాలుగేళ్లలో ఏం పని చేశామని ఓట్లు వేయమని ఎలా అడగాలి. ప్రాజెక్టులు ఏమన్నా కట్టామా. ఏ పనైనా మొదలుపెట్టామా. శంకుస్థాపన ఏమన్నా చేశామా. ప్రజలను ఏమని ఓట్లు అడగాలి. కేవలం పింఛన్లు ఇస్తే ఓట్లు వేసేస్తారా. గత ప్రభుత్వం కూడా పింఛన్లు ఇచ్చింది. వాళ్లకు ప్రజలు ఓట్లు వేశారా. ఇళ్లు కడతామని లేఔట్ వేశాం. ఇళ్లు ఎక్కడైనా కట్టామా’ అని ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి ప్రశ్నించారు.

కండలేరు రిజర్వాయర్ దగ్గరే ఉన్నా రాపూరులో ఒక్క చెరువులో నీళ్లు నింపలేకపోయామని పేర్కొన్నారు. కండలేరు అభివృద్ధి విషయంలో వైఎస్సార్ కల నెరవేర్చలేకపోయామని ఆనం విచారం వ్యక్తం చేశారు. వైఎస్సార్ కలను నెరవేర్చలేని దౌర్భాగ్య స్థితిలో మనం ఉన్నాం అంటూ తీవ్ర ఆవేదన వెలిబుచ్చారు.

ఎస్ఎస్ కెనాల్ కడతామని ఎన్నికల వేళ హామీ ఇచ్చామని, ఇన్నేళ్లయినా కెనాల్ గురించి పట్టించుకోలేదని అన్నారు. గ్రామాల్లో ప్రజలకు బిందెడు నీళ్లు ఇవ్వలేని స్థితిలో ఉన్నామని, ఎస్ఎస్ కెనాల్ గురించి ముఖ్యమంత్రికి ఎన్నోసార్లు చెప్పామని, అసెంబ్లీలోనూ ప్రస్తావించామని, చీఫ్ ఇంజినీర్ల భేటీలోనూ ప్రస్తావించామని ఆనం వెల్లడించారు. కానీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్టు ఎస్ఎస్ కెనాల్ పరిస్థితి ముందుకు కదల్లేదని పేర్కొన్నారు.

ప్రస్తుతం ఆనం చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. గతంలోనూ ఆయన వైస్సార్సీపీ ప్రభుత్వంపై విమర్శలు చేసిన సంఘటనలు ఉన్నాయి.