SIB మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావు అరెస్ట్

తెలంగాణలో సంచనలం రేపిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పరిమాణం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావును హైదరాబాద్ పంజాగుట్ట పోలీసులు అరెస్టు చేశారు. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్(ఎస్ఐబీ) అదనపు ఎస్పీ డి.రమేశ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ప్రణీత్ రావుపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు కావటంతో సిరిసిల్ల పోలీసు క్వార్టర్స్‌లో అదుపులోకి తీసుకున్నారు. ఆయనకు సహకరించిన అధికారులపైనా పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే నిఘా కెమెరాలు పనిచేయకుండా చేసి హార్డ్ డిస్కులను ధ్వంసం చేసిన కేసులో ప్రణీత్‌రావు నిందితుడు. ఇటివలే ఆయన్ను సస్పెండ్‌ చేసింది ప్రభుత్వం.

గత ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష నేతల ఫోన్ ట్యాపింగ్ చేశారనే ఆరోపణలు ఎస్ఐబీ డీఎస్పీ దుగ్యాల ప్రణీత్ రావు పై ఉన్నాయి. దీనిపై కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం విచారణకు ఆదేశాలు ఇచ్చింది. ఈ క్రమంలో ఆయన్ను విధుల్లో నుంచి తప్పించింది రేవంత్ సర్కార్. అయితే.. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సస్పెన్షన్‌కు గురైన ఎస్ఐబీ డీఎస్పీ దుగ్యాల ప్రణీత్ రావు అంశంలో కీలక విషయాలు వెలుగు చూశాయి. ఎస్ఐబీలోని ఎస్ఓటి టీంలో కీలకంగా ఆయన వ్యవహరించారు. ఎస్ఐబీ ఆఫీస్ లో సీసీ కెమెరాలు ఆఫ్ చేసి రికార్డులను ప్రణీత్ రావు మాయం చేసినట్లు అధికారులు గుర్తించారు.

42 హార్డ్ డిస్క్‌లను ప్రణీత్ రావు ఎత్తుకెళ్లినట్లు తేల్చారు. 1600 పేజీల కాల్ డేటాను ప్రణీత్ రావు తగులబెట్టినట్లు నిర్ధారించారు. కీలకమైన ఎస్ఓటి లాకర్ రూంలోని ఫైల్స్ మొత్తం ప్రణీత్ రావు ధ్వంసం చేసినట్లు పోలీసు శాఖ గుర్తించింది. కీలక నేత ఫోన్ ట్యాపింగ్ డేటాతో పాటు.. కాల్ రికార్డులు కొన్ని ఐఎంఈ నెంబర్లతో పాటు ఐపీడీఆర్ డేటాని కూడా నాశనం చేసినట్లు గుర్తించారు. స్పెషల్ ఆపరేషన్ టీమ్స్ తయారు చేసిన డేటా మొత్తాన్ని ప్రణీత్ రావు ధ్వంసం చేసినట్లు పేర్కొంది. హెచ్ డీడీకి సంబంధించిన ముఖ్యమైన సమాచారాన్ని కూడా ధ్వంసం చేసినట్లు పోలీస్ శాఖ తెలిపింది.