షిర్డీ సాయినాథుని లీలలు : నిర్ణయం

Shirdi sai baba
Shirdi Sai Baba

సాయిబాబా వంటి సత్పురుషులను దర్శించేందుకు ఎంతో దూరం నుండి వచ్చే వారు కూడా ఉన్నారు. ఒకసారి హరిద్వార్‌ బువా అనే పేరు గల వ్యక్తి సాయిని దర్శించాలనుకున్నాడు. నాగపూర్‌లో శ్రీసాయినాధుని పవిత్ర చరిత్రను చదివి ఆనందించాడు. ఇక దర్శనం కొరకు వస్తున్నాడు. టాంగాలో కోపర్గాం దాకా చేరాడు. అక్కడ నుండి ద్వారకామాయి పైన రెపరెపలాడే పతాకాన్ని చూచాడు. పతాకం అంటే జండా. ఆడంబరానికి గుర్తుగా తలచాడు.

ఆయనతో పాటు ఇతరులు కూడా ప్రయాణం చేస్తున్నారు ఆ టాంగాలో. ‘ఈ యోగి (సాయిబాబా) కీరి కొరకు పాటుపడుతున్నట్లో తోచుచున్నది అనుకున్నాడు. కీర్తి కొరకు పాకులాడే యోగిని సందర్శించటం అనవసరం అనుకున్నాడు. ఈయన వాలకాన్ని తోటి ప్రయాణికులు గుర్తించి, అటువంటి అపవిత్రపు ఆలోచనలను మాని, షిరిడీకి వెళ్లి సాయిబాబాను దర్శింపుమని గట్టిగా సలహా ఇచ్చారు. మనసు పరిపరివిధాల ఆలోచిస్తున్నది.

అది మానవ – సామాన్య మానవులకు సహజం కాని, కాషౄయపు బట్టలను ధరించిన యతులకు కాదు. ఎలాగో, షిరిడీ వెళ్లాడు. సాయి నిరాడంబరత్వాన్ని కన్నులారా చూచాడు. సంతసించాడు. తొందరపడి నిర్ణయం తీసుకోరాదని హరిద్వార్‌ బువా గాధ తెల్పుతుంది. మాణిక్య ప్రభువు సద్గురువు. ఐశ్వర్యసంపన్నుడు. లోకోత్తర సామర్ధ్యం కలవాడు. ప్రభువు వలెనే ఆయన దుస్తులను ధరించేవాడు. మాణిక్య ప్రభువు తనను దర్శించటానికి వచ్చిన వారికి బండారు ఖానాలో భోజనం ఏర్పాటు చేసేవారు. ఒక వ్యక్తి ఆయనను దర్శించాడు.

ఆయనకు భోజనాన్ని నలుగురితో పాటే ఏర్పాటు చేశారు. ఆ పంక్తిలో మాణిక్యప్రభువు లేకుం డుటను చూచాడు. తాను మాణిక్యప్రభువుతో కలిసి భోజనం చేస్తానని మొండికేశాడు. ఈ విషయాన్ని అక్కడ ఉన్న వ్యక్తులు మాణిక్య ప్రభువుకు చెప్పారు. ఆయన అంగీకరించారు. భోజనం చేసే టప్పుడు ఆ వ్యక్తి కబురు పెడతాననన్నారు మాణిక్యప్రభువు. ఆ వ్యక్తి మాణిక్య ప్రభువు నుండి పిలుపుకై ఎదురు చూస్తున్నాడు. ఎంతకూ పిలుపు రావటం లేదు. మధ్యాహ్నం దాటింది. సాయంకాలమయింది.

రాత్రి గడుస్తోంది. రాత్రి పదకొండుగంటలయింది. ఆ వ్యక్తికి పిలుపు వచ్చింది. భోజనానికి బయలు దేరి వెళ్లాడు. మాణిక్యప్రభు ఒక్కరే ఉన్నారు. మధూకరము (భిక్ష) నుండి ఒక జొన్నరొట్టె ముక్క ఉంచి దానిపై వెల్లుల్లి పచ్చడిని పెట్టి, తాను ఒకటి తీసుకుని మరొక జొన్నరొట్టెను, వెల్లుల్లి పచ్చడిని ఆ వ్యక్తికి ఇచ్చారు మాణిక్యప్రభువు. ‘నేనొక ఫకీరును నాకీ భోజనం తగియున్నది అన్నారు ఆ వ్యక్తితో. మహనీయులలో కొందరు ఆడంబరంగా కనిపిస్తారు. అంతే! వారి అంతరంగం వేరుగా ఉంటుంది. ఆడంబరాన్ని చూచి నిర్ణయించుకోరాదు.

  • యం.పి.సాయినాథ్‌

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/