హాజరు మినహాయింపు ఫీజుపేరుతో దోపిడి

-లబోదిబో మంటున్న ఇంటర్‌ విద్యార్థులు
-కార్పొరేట్‌ కళాశాల్చ నిర్వాహకం
-పట్టించుకోని ఇంటర్‌ బోర్డు

Students (File)

గుంటూరు : విద్యార్థుల ఫీజులను ప్రభుత్వం ఇప్పటికే ఇష్టారాజ్యంగా పెంచేసింది. దీంతో విద్యార్థులు లబోదిబోమంటున్నారు. ఇది ఇలా ఉండగా గతంలో రూ. 2వందలు నుంచి రూ. 5వందలు ఉన్న హాజరు మినహాయింపు ఫీజును రూ. వెయ్యినుంచి రూ. 2వేలకు పెంచేశారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇది ఇలా ఉండగా కొన్ని కార్పోరేట్‌ కళాశాలల్లో హాజరు తగ్గిందనే విషయాన్ని ఆసరాగా తీసుకొని కొన్ని కళాశాలలు విద్యార్థుల నుంచి అపరాద రుసుమును ప్రభుత్వం నిర్ణయించిన ఫీజుకన్నా అధికంగా వసూలు చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఇంటర్మీడియట్‌ పరీక్షల ముసుగులో జిల్లాలోని పలు కార్పోరేట్‌, ప్రైవేటు కళాశాలలు డబ్బులు వసూలు దందాకు పాల్పడుతున్నారు. విద్యాసంవత్సరంలో విద్యార్థులు సకాలంలో కళాశాలలకు హాజరయ్యేందుకు నిర్ణీత హాజరుశాతం ఉంటేనే పరీక్షలకు అనుమతిస్తామన్న ప్రభుత్వ ఆదేశాలు మాటున కొన్ని కళాశాలలు అక్రమవసూళ్లకు పాల్పడుతున్నాయి.

కళాశాల పనిరోజుల్లో హాజరు తక్కువగా ఉన్న శాతాన్నిబట్టి హాజరు మినహాయింపు రుసుమును విద్యార్థులచేత బ్యాంకుల్లో డి.డి కట్టించుకొని ఆ పైన పరీక్షా సమయంలో హాలటిక్కెట్లు ఇవ్వాల్సింది. ఇవేమి పట్టించుకోకుండా ఇంటర్‌బోర్డు నిర్థేశించిన డబ్బుకంటే మూడింతలు అదనంగా వసూలు చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి.

ఈ దోపిడి ఏంటని ప్రశ్నించినవారిని వేదింపులకు గురిచేస్తున్నట్లు తెలుస్తోంది. కొంతమంది విద్యార్థులకు ఇటీవల జరిగిన ప్రాక్టికల్‌ పరీక్షల హాల్‌టిక్కెట్లు ఇవ్వకుండా ఇక్కట్లు పాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. పేద విద్యార్థుల దగ్గర రూ. వేలల్లో హాజరు మినహాయింపు ఫీజులు వసూలు చేయటం ఏమిటని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు.
కొన్ని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో కూడా విద్యార్థులకు హాజరు తగ్గినట్లు తెలుస్తోంది. నిర్ణయించిన హాజరుకంటే రెండుమూడు రోజులు తక్కువగా ఉన్న అపరాద రుసుమును చెల్లించాలంటూ కళాశాల ప్రిన్సిపాల్స్‌ హుకూం జారీ చేస్తున్నారు.

ముఖ్యంగా ఎంపీసీ,బైపీసీ చదువుతున్న విద్యార్థులకు ఈ సమస్య ఎక్కువగా ఎదురవుతోంది. కొంతమంది విద్యార్థులు అనారోగ్య కారణాల వల్ల కళాశాలలకు హాజరుకాకపోవటం జరుగుతోంది. ఈ విషయం కార్పోరేట్‌, ప్రభుత్వ, ఎయిడెడ్‌ కళాశాల ప్రిన్సిపాల్స్‌కి తెలిసినా పట్టించుకోకుండా అదనపు రుసుములు కట్టాలని అంటున్నట్లు తెలుస్తోంది.
కొన్నిచోట్ల విద్యార్థులకు ప్రాక్టికల్‌ పరీక్షల హాల్‌టిక్కెట్లు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు చెబుతున్నారు. ఇలాంటి విషయాలను దృష్టిలో ఉంచుకొని విద్యార్థులకు పరీక్షల్లో అన్యాయం జరగకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

తాజా ఆధ్యాత్మికం వ్యాసాల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/specials/devotional/