మహారాష్ట్ర సీఎం షిండేతో సమావేశమైన శరద్ పవార్

వ్యక్తిగత కారణాలతోనే కలిశారని బిజెపి నేతల వివరణ

sharad-pawar-meets-maharashtra-cm-eknath-shinde

ముంబయిః మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండేను గురువారం నేషనల్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) చీఫ్ శరద్ పవార్ కలుసుకున్నారు. ముంబైలోని సీఎం అధికారిక భవనంలో జరిగిన ఈ భేటీ ప్రస్తుతం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే, వ్యక్తిగత కారణాలతోనే ఈ భేటీ జరిగిందని బిజెపి వివరణ ఇవ్వగా.. మరాఠా మందిర్ 75వ వార్షికోత్సవ వేడుకలకు ముఖ్యమంత్రి షిండేను ఆహ్వానించేందుకే వెళ్లానంటూ శరద్ పవార్ ట్వీట్ చేశారు. కాగా, ఉద్ధవ్ థాక్రే విదేశాలలో ఉండగా పవార్ వెళ్లి షిండేను కలవడంపై రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది.

మరాఠా మందిర్ ట్రస్ట్ స్థాపించి 75 వసంతాలు కావొస్తున్నాయి. ఈ సందర్భంగా వార్షికోత్సవ వేడుకలను చారిత్రాత్మక మరాఠా మందిర్ లో నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ఫంక్షన్ కు ముఖ్యమంత్రి షిండేను ఆహ్వానించేందుకు శరద్ పవార్ వ్యక్తిగతంగా వెళ్లి కలిశారు. సీఎం అధికారిక నివాసంలో ఈ ఇద్దరు నేతల భేటీ గురువారం జరిగింది. ఈ సందర్భంగా మరాఠీ సినిమా రంగం ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించేందుకు ఓ మీటింగ్ ఏర్పాటు చేయాలని కోరినట్లు పవార్ తెలిపారు. థియేటర్ల నిర్వాహకులతో పాటు ఆర్టిస్టులు, సంబంధిత సంస్థలను ఈ మీటింగ్ కు ఆహ్వానించాలని సీఎంతో చర్చించినట్లు పేర్కొన్నారు.