జీ-20 స‌ద‌స్సు .. ఢిల్లీలో క‌ట్టుదిట్టమైన భ‌ద్ర‌త ఏర్పాట్లు

Security Tightened In Delhi Ahead Of G20 Summit

న్యూఢిల్లీః ఈ నెల 9, 10 తేదీల్లో ఢిల్లీలో జీ-20 స‌ద‌స్సును నిర్వ‌హించ‌నున్నారు. ఈ స‌ద‌స్సుకు ప్ర‌పంచ దేశాల అధినేత‌లు హాజ‌రు కానున్నారు. ఈ నేప‌థ్యంలో ఢిల్లీలో భ‌ద్ర‌త క‌ట్టుదిట్టం చేశారు. ఢిల్లీ పోలీసులు, రైల్వే ప్రొటెక్ష‌న్ ఫోర్స్ పోలీసులు నిన్న న్యూఢిల్లీ రైల్వే స్టేష‌న్‌ను సంద‌ర్శించి, భ‌ద్ర‌తా ఏర్పాట్ల‌పై స‌మీక్షించారు. రైల్వేస్టేష‌న్‌లోకి వ‌స్తున్న‌, పోతున్న వారి క‌ద‌లిక‌ల‌పై దృష్టి సారించారు. ప్ర‌తి బ్యాగును క్షుణ్ణంగా త‌నిఖీ చేస్తున్నారు.

ఇక మ‌ధుర రోడ్, బ‌హెయిరాన్ రోడ్డు, పురానా ఖిల్లా రోడ్, ప్ర‌గ‌తి మైదాన్ మార్గాల్లో గూడ్స్ వెహిక‌ల్స్, క‌మ‌ర్షియ‌ల్ వెహికల్స్, అంత‌ర్ రాష్ట్ర బ‌స్సు సర్వీసులు, లోక‌ల్ బ‌స్సులకు అనుమ‌తి లేద‌ని ఢిల్లీ పోలీసులు స్ప‌ష్టం చేశారు. ఈ నిబంధ‌న‌లు సెప్టెంబ‌ర్ 7వ తేదీ అర్ధ‌రాత్రి నుంచి సెప్టెంబ‌ర్ 10వ తేదీ అర్ధ‌రాత్రి వ‌ర‌కు అమ‌ల్లో ఉంటాయ‌న్నారు. పాలు, కూర‌గాయ‌లు, పండ్లు, మెడిక‌ల్‌కు సంబంధించిన వాహ‌నాల‌కు అనుమ‌తి ఉంటుంద‌ని తెలిపారు. ట్యాక్సీల‌కు అస‌లు అనుమ‌తి ఉండ‌ద‌ని స్ప‌ష్టం చేశారు.