కులవివక్షను నిషేధించిన తొలి నగరంగా సియాటిల్

Seattle becomes first US city to ban caste discrimination

వాషింగ్టన్ః అమెరికాలోని సియాటిల్‌ నగరం సంచలన నిర్ణయం తీసుకుంది. నగరంలో కుల వివక్షను నిషేధిస్తూ తీర్మానించింది. దీంతో అమెరికా చరిత్రలోనే కులవివక్షను నిషేధించిన తొలి నగరంగా సియాటెల్ నిలిచింది. అసోసియేటెడ్‌ ప్రెస్‌ వార్తా సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం.. కుల వివక్షను నిషేధించాలన్న ప్రతిపాదనపై సియాటెల్ నగర కౌన్సిల్‌లో మంగళవారం ఓటింగ్ జరగ్గా.. 6-1 తేడాతో ఆమోదం పొందింది. ఇండియన్-అమెరికన్ క్షమా సావంత్ కౌన్సిల్‌లో ఈ ప్రతిపాదన తీసుకొచ్చారు. మంగళవారం జరిగిన నగర కౌన్సిల్ సమావేశంలో ఈ అంశంపై మాట్లాడేందుకు 100 మందికిపైగా గతవారం ప్రారంభంలోనే నమోదు చేసుకున్నారు.

కాగా, ఈ ఆర్డినెన్స్‌కు మద్దతుగా సియాటెల్‌లో, ఇతర ప్రాంతాల్లో దళితులు ర్యాలీలు తీశారని కాలిఫోర్నియాకు చెందిన ఈక్వాలిటీ ల్యాబ్స్ వ్యవస్థాపకుడు తేన్‌మొళి సౌందరరాజన్ తెలిపారు. అయితే, ఇలాంటి చట్టం చేయడం వల్ల ప్రత్యేకంగా ఓ కమ్యూనిటీని కించపరిచినట్లే అవుతుందని కొందరు హిందూ అమెరికన్లు వాదిస్తున్నారు. కుల వివక్షను నిషేధిస్తూ తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌కు మద్దతు పలికిన వారి వాదన మరోలా ఉంది. దేశాల సరిహద్దులు దాటినా కుల వివక్ష తప్పట్లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అమెరికాలో ప్రస్తుతం ఉన్న సివిల్ రైట్స్ ప్రొటెక్షన్ చట్టాలలో కుల వివక్ష నుంచి రక్షణ లేదని చెప్పారు. అందుకే ఈ ఆర్డినెన్స్ అవసరం ఉందని, కుల వివక్షకు పాల్పడితే శిక్ష తప్పదనే భయం ఉండాలని చెబుతున్నారు.