శ్రీకాళహస్తి నియోజకవర్గంలో కొనసాగుతున్న లోకేష్ యాత్ర

నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర శ్రీకాళహస్తి నియోజకవర్గంలో కొనసాగుతుంది. గత నెల 27 న కుప్పం లో ప్రారంభమైన ఈ యాత్ర..నేటికీ 24 వ రోజుకు చేరింది. నేడు శ్రీకాళహస్తి నియోజకవర్గం పరిధిలో లోకేష్ యాత్ర కొనసాగిస్తున్నారు. యాత్ర మొదలుపెట్టిన దగ్గరి నుండి కూడా లోకేష్ ఎంతో ఉత్సహంగా యాత్ర కొనసాగిస్తున్నారు. ప్రజల కష్టాలను అడిగి తెలుసుకుంటూ ప్రభుత్వం ఫై విమర్శలు చేస్తూ వస్తున్నారు. అక్కడక్కడా పోలీసులు యాత్ర కు అడ్డుపడుతున్నప్పటికీ , లోకేష్ మాత్రం ఎక్కడ తగ్గడం లేదు. ఈ కార్యక్రమంలో టీడీపీ శ్రేణులు భారీగా పాల్గొంటున్నారు. ముఖ్యంగా యువనేతతో సెల్ఫీలు తీసుకునేందుకు యువకుల నుంచి వృద్ధుల వరకు ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు.

నిన్న శ్రీకాళ‌హ‌స్తి నియోజ‌క‌వ‌ర్గంలోని తొండ‌మానుపురం పంచాయ‌తీలో యువగళం పాద‌యాత్ర 300 కిలోమీట‌ర్లు పూర్తిచేసుకుంది. ఈ సంద‌ర్భంగా ఈ పంచాయ‌తీ ప‌రిధిలో 13 గ్రామాల దాహార్తి తీర్చే ర‌క్షిత మంచి ప‌థ‌కాన్ని టీడీపీ ప్రభుత్వం వ‌చ్చిన వంద రోజుల్లో ఏర్పాటు చేస్తాన‌ని లోకేశ్ ప్రక‌టించారు. క‌డ‌ప ఉక్కు ఫ్యాక్టరీ శంకుస్థాప‌న‌కి వెళ్లిన సీఎం జ‌గ‌న్ రెడ్డి కొబ్బరికాయ కొట్టటానికి వంగ‌లేక‌పోయాడ‌ని లోకేశ్ ఎద్దేవా చేశారు. తొండ‌మానుపురంలో ప్రజ‌ల్ని ఉద్దేశించి లోకేశ్ మాట్లాడుతూ… “క‌డ‌ప స్టీల్ ప్లాంట్ శంకుస్థాప‌న‌కి వెళ్లి వంగి కొబ్బరి కాయ కొట్టలేని జ‌గ‌న్ తాను కుర్రాడినంటాడు. 72 ఏళ్ల వ‌య‌స్సులో 27 ఏళ్ల కుర్రాడిలా ప‌రుగులు పెట్టే చంద్రబాబు గారిని ముస‌లాడు అంటాడు” అని విమర్శించారు. ఇక పాదయాత్ర ప్రారంభం అయ్యాక ప్రతి 100 కిలోమీటర్ల మైలురాయిని చేరుకోగానే, లోకేశ్ ఏదో ఒక పథకంపై ప్రజలకు స్పష్టమైన ప్రకటన చేయడాన్ని ఆనవాయతీగా మార్చుకున్నారు. మొత్తం 400 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా 4,000 కిలోమీటర్ల మేర లోకేశ్ పాదయాత్ర చేయనున్నారు.