లేటుగా వచ్చిన టీచర్లకు చుక్కలు చూపెట్టిన తల్లిదండ్రులు

పిల్లలు సరిగా చదవకపోయినా, వారు స్కూళ్లలో తప్పుడు చేసినా టీచర్లు వారిని కఠినంగా శిక్షిస్తుంటారు. అయితే టీచర్లు తప్పు చేస్తే వారిని ఎవరు శిక్షిస్తారు? ఈ ప్రశ్నకు సమాధానం లేదని భావించిన కొందరు టీచర్లు స్కూలుకు రోజూ లేటుగా రావడం మొదలుపెట్టారు. అయితే ఇదే అలవాటుగా చేసుకున్న వారికి పిల్లల తల్లిదండ్రులు చుక్కలు చూపెట్టారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది.

అసలే కరోనా సమయంలో పాఠశాలలు పూర్తిగా మూసేశారు. ఇటీవల పాఠశాలలు తెరుచుకుని అంతంత మాత్రంగా విద్యను బోధిస్తున్నాయి. అయితే ఇలాంటి సమయంలో కూడా పాఠశాల ఉపాధ్యాయులు తమ అలసత్వాన్ని, నిర్లక్ష్యాన్ని ప్రదర్శించారు. ఉరవకొండ నియోజకవర్గంలోని కూడేరు జిల్లా పరిషత్ హైస్కూ్ల్‌లో టీచర్లు రోజూ ఆలస్యంగా వస్తున్నారు. ఇది తెలుసుకున్న విద్యార్ధుల తల్లిదండ్రులు వారికి తగిన బుద్ది చెప్పాలని భావించారు. విద్యార్థుల తల్లిదండ్రులతో ప్రతి పాఠశాలకు స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీని ఏపీ సర్కార్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. దీంతో కూడేరు హైస్కూల్‌లో టీచర్లు ఆలస్యంగా రావడంతో ఆ స్కూల్ హెడ్ మాస్టర్ గదికి తాళం వేశారు ఆ కమిటీ ఛైర్మెన్.

రోజూలాగే ఆలస్యంగా వచ్చిన టీచర్లు, విద్యార్ధుల తల్లిదండ్రులు చేస్తు్న్న నిరసనతో షాక్ అయ్యారు. వారు ఒక్కమాట కూడా మాట్లాడకుండా సైలెంట్‌గా నిలబడటంతో విద్యార్ధుల తల్లిదండ్రులు వారిని ఏకిపారేశారు. మరోసారి ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడమే కాకుండా వారి ఉద్యోగం ఊస్ట్ అయ్యేలా చేస్తామని హెచ్చరించారు. ఎప్పుడూ పిల్లలను శిక్షించే టీచర్లకు శిక్ష పడటం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.