ఏపీలో పరామర్శ యాత్ర మొదలుపెట్టబోతున్న పవన్ కళ్యాణ్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో ఆత్మహత్యలు చేసుకున్న కౌలురైతుల కుటుంబాలను పరామర్శించేందుకు సిద్ధమయ్యారు. గత ఎన్నికల్లో ఘోర ఓటమి చవిచూసిన పవన్ కళ్యాణ్..ఈసారి పొత్తులు పెట్టుకొని అయినాసరే గెలిచి తీరాలని కసి గా ఉన్నాడు. రీసెంట్ గా జరిగిన పార్టీ ఆవిర్భావ సభ లోను ఇదే చెప్పాడు. వైసీపీ పార్టీ ని అధికారంలోకి తీసుకురాకుండా చేసేందుకు పొత్తుకు సై అన్నట్లు చెప్పకనే చెప్పాడు.

ఈ క్రమంలో ఇప్పటి నుండే ప్రజల్లో స్థానం సంపాదించేందుకు ప్రణాళికలు చేస్తున్నాడు. రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబాలకు రూ. లక్ష ఆర్ధిక సాయాన్ని అందజేస్తున్నట్లు ప్రకటించిన పవన్..ఇప్పుడు వారికీ నేరుగా ఆ సాయాన్ని అందజేసేందుకు వెళ్తున్నాడు. ఏప్రిల్ 12 నుండి ఈ పరామర్శ యాత్ర అనంతపురం నుంచి ప్రారభించబోతున్నారు. ఈ విషయాన్ని జనసేన నేత నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి రెండేళ్లల్లో 1,857 మంది కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని.. తొలి ఏడాది 1019 మంది, రెండో ఏడాది 838 మంది కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆరోపించారు.

పవన్ తన పరామర్శ యాత్ర ద్వారా ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబాలకు రూ. లక్ష ఆర్ధిక సాయాన్ని జనసేన తరపున అందిస్తారని నాదెండ్ల మనోహర్ తెలిపారు. సీఎం జగన్ మళ్లీ పాదయాత్ర చేస్తే ప్రతి రైతు నిరసన తెలుపుతారని.. రైతులందరూ జగన్ ప్రభుత్వంపై మండిపడుతున్నారని అన్నారు.