సలార్ కోసం లోఫర్ పాప?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ ‘సలార్’ అనే చిత్రాన్ని అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను ఇటీవల ప్రకటించిన చిత్ర యూనిట్, త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ను మొదలుపెట్టాలని చూస్తోంది. ఇక ఈ సినిమాతో మరోసారి పాన్ ఇండియా రేంజ్‌లో ప్రభాస్ తన యాక్షన్‌తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీగా సలార్‌ను తీర్చిదిద్దేందుకు ప్రశాంత్ నీల్ సిద్ధమవుతున్నాడు.

అయితే ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్ నటిస్తున్న సలార్ చిత్రంలో ఆయన సరసన హీరోయిన్‌గా ఎవరిని తీసుకుంటారా అనే సందేహం ప్రేక్షకుల్లో నెలకొంది. కాగా ఇప్పటికే పలువురి పేర్లు ఈ సినిమా కోసం వినిపించినా, చిత్ర యూనిట్ మాత్రం ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే తాజాగా సలార్ చిత్రంలో ఓ బాలీవుడ్ బ్యూటీ నటించబోతున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్‌లో స్టార్ బ్యూటీగా మారిన దిషా పటానీ సలార్ చిత్రంలో ప్రభాస్‌తో రొమాన్స్ చేసేందుకు రెడీ అయినట్లు తెలుస్తోంది. పాన్ ఇండియా గుర్తింపు ఉన్న బ్యూటీగా దిషాకు మంచి క్రేజ్ ఉందని చిత్ర యూనిట్ భావిస్తోంది. గతంలో ఆమె వరుణ్ తేజ్ సరసన లోఫర్ చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే.

ఇప్పటికే సలార్ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేయగా, దానికి అదిరిపోయే రెస్పాన్స్ దక్కింది. ఇక ఈ సినిమాలో ప్రభాస్ ఊరమాస్ లుక్‌లో కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకోవడం ఖాయమని ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తే అర్థమవుతోంది. ఈ సినిమాను భారీ బడ్జెట్ చిత్రంగా దర్శకుడు ప్రశాంత్ నీల్ తనదైన శైలిలో తెరకెక్కించేందుకు రెడీ అయ్యాడు. మరి సలార్ చిత్రంలో నిజంగా దిషా పటానీ హీరోయిన్‌గా చేస్తుందా లేదా అనేది అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చాకే తెలుస్తుంది.