ప్రధాని మోడీ భద్రతలో లోపంపై సుప్రీం కోర్టు కీలక విచారణ

ప్రధాని పర్యటన రికార్డులను భద్రపరచండి.. కేంద్రం, రాష్ట్రం దర్యాప్తులు నిలిపివేయాలి: సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ : ప్రధాని పంజాబ్ పర్యటనకు సంబంధించిన అన్ని రికార్డులను జాగ్రత్త పరచాలంటూ పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ ను సుప్రీంకోర్టు తాజాగా ఆదేశించింది. భద్రతా లోపాలకు సంబంధించి దాఖలైన పిటిషన్ పై సుప్రీంకోర్టు శుక్రవారం విచారణ నిర్వహించింది. ఈ కేసులో సోమవారం తదుపరి విచారణ వరకు కేంద్ర ప్రభుత్వం, పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా ఎటువంటి విచారణ చేపట్టవద్దని ఆదేశించింది.

‘‘ప్రధానికి రక్షణ కల్పించడం జాతి భద్రతకు సంబంధించిన విషయం. ఇది పార్లమెంటు పరిధిలోకి వస్తుంది. ఈ కేసులో వృత్తిపరమైన నిపుణులు దర్యాప్తు చేపట్టాల్సిన అవసరం ఉంది’’ అంటూ న్యాయవాది మణీందర్ సింగ్ వాదనలు వినిపించారు. దీంతో ప్రధాని పర్యటనకు సంబంధించిన అన్ని రికార్డులు జాగ్రత్త పరచాలని పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ ను ఆదేశించింది. ప్రధాని పర్యటన తాలూకు వైర్ లెస్ సందేశాలు, తదితర సాక్ష్యాల సేకరణ విషయంలో రిజిస్ట్రార్ జనరల్ కు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ నుంచి ఒక అధికారి సహకారం అందించాలని సూచించింది. సదరు రికార్డులను ఎక్కడ ఉంచేదీ రిజిస్ట్రార్ జనరల్ కు సాధారణంగా తెలియదని పేర్కొంది. చండీగఢ్ డీజీపీ సహకారం కూడా తీసుకోవాలని రిజిస్ట్రార్ జనరల్ కు సూచించింది.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/