ఆర్టీసీ విలీన బిల్లు ఆమోదంతో సంబరాలు చేసుకుంటున్న ఉద్యోగులు

నిన్న ఉదయం వరకు ఆర్టీసీ విలీన బిల్లు ఫై తీవ్ర ఉత్కంఠ నెలకొంది ఉంది. మంత్రి మండలి సమావేశంలో ఆర్టీసీ విలీన బిల్లుకు ఆమోదం తెలిపినప్పటికీ..గవర్నర్ పలు అంశాలపై ప్రభుత్వం నుండి క్లారిటీ రావాల్సి ఉందని పెండింగ్ లో పెట్టేసరికి అసెంబీ సమావేశాల్లో బిల్లు ఆమోదం అవుతుందో లేదో అని ఆర్టీసీ ఉద్యోగస్తులు కంగారుపడ్డారు. కానీ చివరి నిమిషంలో గవర్నర్ బిల్లు ఫై సంతకం పెట్టడం..శాసన సభలో మంత్రి పువ్వాడ విలీన బిల్లును ప్రవేశ పెట్టడం..శాసన సభ ఆమోదించడం చకచకా జరిగిపోయింది.

శాసన సభ ఆమోదం తెలుపడం తో తాము ఇక ప్రభుత్వ ఉద్యోగులమే అని ఉద్యోగులు సంబరాలు చేసుకోవడం మొదలుపెట్టారు. ఆర్టీసీ లో పనిచేస్తున్న సుమారు 43 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులుగా మారారు. అనేక కష్టనష్టాలతో జీవితాలను వెల్లదీస్తున్న ఆర్టీసీ కార్మికులకు ఉద్యోగ భద్రత లభించడంతోపాటు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఆర్టీసీ ఉద్యోగులకు కూడా జీతభత్యాలతోపాటు ప్రభుత్వ సర్వీస్‌ రూల్స్‌ ప్రకారం బదిలీలు, ప్రమోషన్లు, పింఛన్‌, గ్రాట్యుటీ తదితర సౌకర్యాలు కలుగనున్నాయి.

ఆర్టీసీ ఉద్యోగులు యథాతథ స్థితిలో పబ్లిక్‌ సర్వీసులోకి ప్రభుత్వ ఉద్యోగులుగా మారుతారని వెల్లడించారు. ఆర్టీసీ కార్యకలాపాలు మునపటిలాగే కొనసాగుతాయని, ఆస్తులు అన్నీ యథాతథంగా ఆర్టీసీ ఆధీనంలోనే ఉంటాయని స్పష్టంచేశారు. ప్రభుత్వం కొత్త సర్వీసు నిబంధనలు రూపొందించే వరకు ప్రస్తుత ఆర్టీసీ సర్వీసు రూల్స్‌, ఇతర నిబంధనలే వర్తిస్తాయని చెప్పారు. ఆర్టీసీ రోజువారీ కార్యకలాపాలు, స్థిర, చర ఆస్తుల నిర్వహణ కొత్తగా ఏర్పడే డిపార్ట్‌మెంట్‌, ఆర్టీసీ డైరెక్టర్ల బోర్డు ఆధ్వర్యంలో కలిసి కొనసాగుతాయని మంత్రి పువ్వాడ తెలిపారు.

ఆర్టీసీని విలీనం చేసుకోవడం వల్ల జీతభత్యాల రూపంలో ప్రభుత్వంపై అదనంగా ఏటా రూ.3,000 కోట్ల భారం పడుతున్నదని వివరించారు. నేడు ఆర్టీసీలో రెగ్యులర్‌ ఉద్యోగుల సంఖ్య 43,055 కాగా, కాంట్రాక్టు, క్యాజువల్‌ ప్రాతిపదికన ఉన్న ఉద్యోగులు 248 మంది ఉన్నారని తెలిపారు. 43,055 మంది ఉద్యోగులు ఈ బిల్లు ద్వారా ప్రభుత్వ సర్వీసులోకి అబ్జార్బ్‌ అవుతున్నారని, డైలీ వేజెస్‌, ఔట్‌సోర్సింగ్‌ కార్మికులు యథావిధిగా ఏజెన్సీల ఆధ్వర్యంలో కొనసాగుతారని వివరించారు.