కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఫై సజ్జల రామకృష్ణారెడ్డి ఆగ్రహం

sajjala comments on kotamreddy

ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఫై వైస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసారు. టీడీపీలోకి వెళ్లడానికి సిద్ధమైన తర్వాతే కోటంరెడ్డి ప్రభుత్వం ఫై ఆరోపణలు చేయడం మొదలుపెట్టారని రామకృష్ణారెడ్డి అన్నారు. గత కొద్దీ రోజులుగా వైస్సార్సీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పేరు వార్తల్లో నిలుస్తుంది. సొంత పార్టీ పైనే విమర్శలు చేస్తూ హాట్ టాపిక్ అవుతున్నారు. ఇక రెండు రోజులుగా తన ఫోన్ ను ట్యాపింగ్ చేస్తున్నారని మీడియా ముందుకు వచ్చి తన ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఆధారాలను ఆయన ఈ రోజు ప్రెస్ మీట్ లో బయట పెట్టారు.

తన ఫోన్ ట్యాప్ చేస్తున్న విషయాన్ని తనపై అభిమానం ఉన్న ఓ ఐపీఎస్ అధికారి చెప్పారని వెల్లడించారు. కానీ, తాను నమ్మలేదన్నారు. సీఎం జగన్ ను ఇంతగా అభిమానించే, అధికారి పార్టీ ఎమ్మెల్యే అయిన తన ఫోన్ ఎందుకు ట్యాప్ చేస్తారని అనుకున్నానని చెప్పారు. తన చిన్ననాటి స్నేహితుడైన ఓ కాంట్రాక్టర్ కు ఫోన్ చేసి మాట్లాడిన సంభాషణ బయటకు వచ్చిందన్నారు. నేను మూడు దశాబ్దాలుగా వైఎస్ కుటుంబం పట్ల విధేయంగా ఉన్నా. సీఎం జగన్ ను ఎంతగానో అభిమానించా. అవమానాలు ఎదురైనా పార్టీ కోసం కష్టపడ్డా. నన్ను అవమానించిన చోట ఇక నేను ఉండకూడదని నేను నిర్ణయం తీసుకున్నా. వచ్చే ఎన్నికల్లో వైస్సార్సీపీ తరఫున పోటీ చేయను అని తేల్చి చెప్పారు. త్వరలోనే టీడీపీ లో చేరబోతున్నట్లు సంకేతాలు ఇచ్చారు.

మరోపక్క శ్రీధర్ రెడ్డి ఫై వైస్సార్సీపీ నేతలు విమర్శల వర్షం కురిపించడం మొదలుపెట్టారు. ఇప్పటీకే మంత్రి అమర్ నాధ్ స్పందించగా..తాజాగా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి శ్రీధర్ రెడ్డి వ్యవహారం ఫై స్పందించారు. టీడీపీలోకి వెళ్లడానికి సిద్ధమైన తర్వాతే కోటంరెడ్డి ఈ రకమైన వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. కొంతమందిని ఎలా లాక్కోవాలో చంద్రబాబుకు బాగా తెలుసని సజ్జల వ్యాఖ్యానించారు. అయినా, ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు.

‘కోటంరెడ్డిపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఏముంది? ఆయనే తన ఉద్దేశాలు వెల్లడించిన తర్వాత ఏం చర్యలు తీసుకోగలం? సీఎం జగన్ ప్రజలను నమ్ముకుని పాలన చేస్తున్నారే తప్ప ఫోన్ ట్యాపింగ్ లను నమ్ముకుని కాదు. ఎవరు ఎవరికైనా ఫిర్యాదు చేసుకోవచ్చు. పదవి రాలేదన్న అసంతృప్తి ఉండడం వేరు, బహిరంగంగా ఇలాంటి ఆరోపణలు చేయడం వేరు’ అంటూ సజ్జల పేర్కొన్నారు.