డేరా బాబాకు పెరోల్​.. 21 రోజుల సెలవును మంజూరు

చండీగఢ్: డేరా సచ్చా సౌధా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ రెండు దశాబ్దాల క్రితం నాటి మర్డర్ కేసుతో పాటు ఇద్దరు మహిళలను రేప్ చేసిన కేసుల్లో రోహ్ తక్ లోని సునారియా జైల్లో డేరా బాబా జీవితఖైదును అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. ఆయనకు 21 రోజుల సెలవును హర్యానా ప్రభుత్వం ఈరోజు మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో, ఆయన ఈ సాయంత్రం జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది.

పంజాబ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్న తరుణంలో డేరా బాబాకు సెలవు మంజూరు చేయడం గమనార్హం. పంజాబ్ లో డేరా బాబాకు పెద్ద సంఖ్యలో మద్దతుదారులున్నారు. ఏ ఎన్నికలను అయినా వారు ప్రభావితం చేసేంత పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో బీజేపీ, కాంగ్రెస్, అకాలీదళ్ పార్టీలు రామ్ రహీమ్ కు చెందిన డేరా నేతలతో సాన్నిహిత్యంగా మెలుగుతుంటాయి. డేరా బాబా విడుదలవుతున్న నేపథ్యంలో ఆయన అనుచరులు ఆనందంలో మునిగిపోయారు. ఆయనకు భారీ స్థాయిలో స్వాగతం పలికేందుకు వారు సిద్ధమవుతున్నారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/