సికింద్రాబాద్ మహంకాళి బోనాల ఉత్సవాల్లో అపశృతి..కరెంట్ షాక్ తో యువకుడు మృతి

సికింద్రాబాద్ మహంకాళి బోనాల ఉత్సవాలు ఆదివారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆదివారం తెల్లవారుజాము నుంచి అమ్మవారి ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నారు. రాష్ట్ర నలుమూలల నుంచి బోనాల పండుగకు భక్తులు తరలివచ్చారు. అలాగే సీఎం కేసీఆర్ దగ్గరి నుండి అనేక మంది రాజకీయ నేతలు అమ్మవారిని దర్శించుకున్నారు. కాగా ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా అమ్మవారిని దర్శించుకున్నారు. అంత బాగా జరుగుతున్నాయి అనుకున్న సమయంలో ఆదివారం రాత్రి అపశ్రుతి చోటుచేసుకుంది.

ఈ క్రమంలోనే అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చిన ఆకాశ్‌సింగ్‌ (27) కరెంట్ షాక్ తో మృతి చెందారు.ఆదివారం రాత్రి కూడా అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చారు. భక్తులు ఎక్కువగా ఉండటంతో ఆకాష్ సింగ్ బయటే నిలబడ్డాడు. అదే సమయంలో వర్షం పడుతుండడం… ఆకాశ్‌ సింగ్‌ అనుకోకుండా విద్యుత్‌ స్తంభాన్ని తగిలాడు. వర్షం పడిన కారణంగా అతడికి విద్యుత్‌ షాక్‌ తగిలింది. అంతే అక్కడే గిలగిలా కొట్టుకుంటూ ప్రాణాలు కోల్పోయాడు. కార్వాన్‌ ప్రాంతానికి చెందిన ఆకాశ్‌ సింగ్ బేగంబాజర్‌లో సేల్స్‌మ్యాన్‌గా పని చేస్తున్నాడు. భక్తుడి మరణంతో కాసేపటి వరకు అమ్మవారి ప్రాంగణంలో అలజడి నెలకొంది. అనంతరం పోలీసుల చొరవతో తిరిగి యథావిథిగా భక్తులు అమ్మవారికి మొక్కులు సమర్పించుకున్నారు.