ప్రియురాలికి రూ.900 కోట్ల ఆస్తి రాసిచ్చిన ఇటలీ మాజీ ప్రధాని సిల్వియో

గత నెలలో స్విలియో బెర్లుస్కోని మృతి

Ex-Italian PM Leaves Over Rs 900 Crore To 33-Year-Old Girlfriend In His Will

రోమ్‌: ఇటలీ మాజీ ప్రధాని సిల్వియో బెర్లుస్కోని గత నెలలో కన్నుమూసిన సంగతి తెలిసిందే. 86 ఏళ్ల బెర్లుస్కోనీ లుకేమియాతో బాధపడుతూ, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ కు గురై ప్రాణాలు విడిచారు. అయితే, బెర్లుస్కోనికి సంబంధించి ఇప్పుడొక ఆసక్తికర అంశం వెలుగులోకి వచ్చింది. బెర్లుస్కోని గత కొంతకాలంగా మార్తా ఫాసినా అనే 33 ఏళ్ల అతివతో ప్రేమాయణం సాగిస్తున్నారు. ఇద్దరి మధ్య 53 ఏళ్ల వయోభేదం ఉన్నప్పటికీ, బెర్లుస్కోని అదేమీ పట్టించుకోలేదు. అంతేకాదు, తన మనసు దోచిన ఫాసినా పేరిట ఆయన రూ.900 కోట్ల ఆస్తిని రాశారని, ఆ మేరకు వీలునామాలో పేర్కొన్నారంటూ ప్రఖ్యాత మీడియా సంస్థ బ్లూంబెర్గ్ వెల్లడించింది.

ఇటలీ కుబేరుల్లో ఒకరైన బెర్లుస్కోని మొత్తం సంపద విలువ రూ.4.6 లక్షల కోట్లు కాగా, అందులో రూ.900 కోట్లు పెద్ద విషయమేమీ కాకపోయినప్పటికీ, మాజీ ప్రధానితో డేటింగ్ కారణంగా ఫాసినాకు ఇది ఊహించని బొనాంజా. మరోవైపు మార్తా ఫాసినా కూడా రాజకీయ నాయకురాలే. ఇటలీ చాంబర్ ఆఫ్ డిప్యూటీస్ లో ఆమె 2018 నుంచి సభ్యురాలిగా కొనసాగుతున్నారు.