చంద్రబాబు ఫై అంబటి ఫైర్..

వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే అంబటి రాంబాబు ..చంద్రబాబు ఫై ఆగ్రహం వ్యక్తం చేసారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై టీడీపీ అడ్డగోలు విమర్శలు చేస్తోందని..మూడేళ్లలో రూ.1.50 లక్షల కోట్లను సంక్షేమం కోసం జగన్ సర్కార్ వెచ్చించిందని.. చంద్రబాబు మాటలను ప్రజలు ఎవరూ విశ్వసించడం లేదన్నారు. చంద్రబాబు తన ఊహాల్లో మాత్రమే ఏపీని అభివృద్ధి చేశారని ఎద్దేవా చేశారు. వైఎస్సార్‌ హయాంలోనే హైదరాబాద్‌ ఓటర్‌ రింగ్‌రోడ్డు పూర్తయిందని అంబటి రాంబాబు అన్నారు. చంద్రబాబు సీఎంగా ఉన్న కాలంలో ఎన్ని వాగ్దానాలు నెరవేర్చారో చెప్పగలరా? అని అంబటి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

గుంటూరు జిల్లాలో దళితులపై దాడి జరగలేదని.. కులాలు వర్గాల మధ్య చిచ్చుపెట్టాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని అంబటి మండిపడ్డారు. వైఎస్సార్సీపీని కించపరచి.. పైకి రావాలని బాబు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. టీడీపీ కుట్రలను ప్రజలు తెలుసుకుంటారని.. వారి హయాంలో అరాచకాలు, అన్యాయాలు దారుణంగా జరిగాయన్నారు. ‘లోకేష్ బాబు తల్లిని ఎవరూ ఏమీ అనలేదు. మమ్మల్ని అభాసుపాలు చేసేందుకు ఇలా ప్రయత్నిస్తున్నారు. అనని మాటలు అన్నట్లుగా చిత్రీకరిస్తున్నారు..’ అని అంబటి రాంబాబు అన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని తాము ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి డిమాండ్ చేస్తున్నామని అంబటి అన్నారు. ప్యాకేజి తీసుకుని ప్రత్యేక హోదాను ముంచిన వ్యక్తి చంద్రబాబు అని మండిపడ్డారు.