మహాభక్తురాలు శబరి

ఆధ్యాత్మిక చింతన-

Sabari-Great devotee
Sabari-Great devotee

కారడవుల్లో నివసించే నిషాద గిరిజన వంశానికి చెందిన మహిళ శబరి. జంతువుల్ని వేటాడే కుటుంబంలో జన్మించినా పరమకారుణ్య మూర్తిగానే బ్రతికింది.

ఆమె వల్లించే అహింసా సిద్ధాంతాలు ఆలకించి గూడెంలో జనం ఆశ్చర్యపోతుండేవారు. ఆకులు అలములు తింటూ దైవప్రార్థనలో గడిపే ఆమెను చూసి విస్మయానికి లోనయ్యేవారు శబరికి పెళ్లీడు వచ్చింది. తల్లిదండ్రులు వీరుడైన వనపుత్రుణ్ణి వెతికారు.

పాణిగ్రహణం నిర్ణయమైంది. సుమూర్తం దగ్గరపడుతోంది. విందుభోజనాల కోసం కుటుంబ సభ్యులు రకరకాల పక్షుల్ని, ప్రాణుల్ని పట్టి తెచ్చారు.

రాత్రికి రాత్రే వీటిని వధించి వంటలు ప్రారంభిస్తారన్నమాట. ఇదంతా తెలుసుకున్న శబరి తల్లడిల్లిపోయింది.

తన పెళ్లికోసం ఇన్ని జీవాలు బలైపోవడమేంటనీ కన్నీరు మున్నీరైంది. దైవాన్ని స్మరించుకుంటూ కళ్యాణవేదికను వదిలిపెట్టింది.

గూడేనికి దూరంగా ఎవరికీ కనపడనంత దూరంగా వెళ్లిపోయింది. నడవగా నడవగా మాతంగమహర్షి ఆశ్రమం కనబడింది.

దీనవదనురాలైన శబరిని చూసి ఆ మహర్షి జాలిపడ్డాడు. ఆమె కథ తెలుసుకుని చలించిపోయాడు. తోబుట్టులే వచ్చినట్లు అభిమానపడ్డాడు. ఆ రోజునుంచి భవరిది ఆశ్రమవాసమే. ఉదయమే మాతంగుడు

నదీస్నానం చేసి వచ్చేసరికి దర్బలు సిద్ధం చేసేది. యజ్ఞవాటికలు శుభ్రపరిచేది. పూజాదికాలకు ఏర్పాట్లుచేసేది. ఆమె భక్తి తత్పరత రుజువర్తన అహింసావాదం ఆశ్రమంలోని వారందరినీ అబ్బురపరిచేది.

నిరంతరం దైవధ్యానంలో గడుపుత మృదుభాసిగా పేరు తెచ్చుకున్న శబరిని వారెంతగానో గౌరవించేవారు. ఆమె నడవడికను మెచ్చిన మాంతగను గౌరించేవారు. ఆమె నడవడికను మెచ్చిన మాతంగమహర్షి వరమిచ్చాడు.

జనకుల తిలకుడు, రఘువంశసోముడు అయినా రామభద్రుడు స్వయంగా వచ్చి దర్శనమిస్తాడని చెబుతాడు. ఆనాటి నుంచి రామయ్యకోసం వేయి కళ్లతో ఎదురు చూస్తుంది.

యేళ్లు గడుస్తుంటాయి. శబరి ముదివగ్గవుతుంది. కంటిచూపు తగ్గింది. వినికిడి శక్తి క్షీణించింది. రాముని జాడ కనిపించదు. కానీ శబరి నిరాశ చెందదు.

నీలమేఘశ్యాముడిని ఒక్కమాటయినా అనదు. ఆస్వామి కనిపించేవరకు వేచి రామనామాన్ని జపిస్తానని కనిపించాక ఆయన దివ్యదర్శనంతో పరమానందాన్ని పొందుతానని సంబరపడుతుంటుంది.

తనకేది ప్రాప్తమైనా అది దేవుని దయేనని గట్టిగా నమ్ముతుంది. అంతటి ధర్మబుద్ధి ఆమె సొంతం. రాముడు ఎప్పుడొస్తాడో తెలిదు.

అలా అని ఆ తండ్రి అకస్మాత్తుగా దయచేస్తే ఫలహారం అప్పటికప్పుడు ఎక్కడి నుండి తేగలనని శబరి ప్రతిపైటా తర్జనభర్జన పడేది. ఈ రోజే రామచంద్రుడు వస్తారన్నట్లుగా అనుదినమూ అడవిలో పండ్లను సేకరించేది.

మందుగా తాను రుచి చూసేది. అవి మధురంగా లేకపోతే నేల పాల్జేసేది. తియ్యగా ఉంటేనే బుట్టలో వేసి ఇంటికి తెచ్చేది. కొన్నాళ్లకు ఆమె నిరీక్షణ ఫలించి సీతాన్వేషణ జరిపేందుకు బయలుదేరిన రామలక్ష్మణులు అటవీ మార్గాన వెళుతూ ఆమెకు దర్శనమిచ్చారు.

వారిని చూడగానే ఆమె గుండె ఉప్పొంగిపోయింది. ఆ తల్లి కళ్లు ఆనందాశ్రువులు వర్షించాయి. వణుకతున్న దేహంతో ఊతకర్రతో నడవలేక నడుస్తూ రామలక్ష్మణులకు ఎదురేగి స్వాగతం పలుకుతుంది.

ఇన్నాళ్లకిలా దర్శనమిచ్చారా దాశరథీ అంటూ రామహస్తాన్ని తన చేతుల్లోకి తీసుకుని కళ్లకద్దుకుంటుంది. ఎప్పుడనగా తిన్నావో ఏమోనని ఫలాలు సమర్పిస్తుంది.

అరమగ్గిని ఆ కొండరేగుపళ్లు ఆమె ఎంగిలి చేసినవి. దైవానికి సమర్పించే ద్రవ్యాలు ఎంగిలి కాకూడదనేది సగటు భక్తుల విశ్వాసం. ఆ ఎంగిలి పళ్లలో శబరి అమల హ్పుదయం నిక్షిప్తమై ఉందని రామునికి తెలుసు.

అందుకే ఆయన వాటిని ఎంతో పదిలంగా స్వీకరించారు. శబరి ఆతిథ్యానికి ఎంతగానో సంతోషిస్తాడు. ఆమెకు మోక్షపథాన్ని ప్రసాదిస్తాడు.

చల్లని రామయ్య తత్వాన్ని తెల్లని శబరమ్మ గుణగణాలను అర్ధం చేసుకున్న లక్ష్మణుడు ఆ సందర్భాన కగిరిపోతాడు.

కళ్లనీళ్ల పర్యంతమై ఆ మహాభక్తురాలి ముందు మోకరిల్లుతాడు. ఇంతటి యోగ్యారాలిని సందర్శించినందుకు జన్మతరించిందని సంబపరడతాడు.

శుద్ధమైన అంతఃకరణ, పరిశుద్ధమైన ఆధ్యాత్మికభావస్రవంతి ఉంటే భగవంతుని ప్రేమకు ఎవరైనా పాత్రులు కావచ్చని భక్త శబరి జీవితం తేటతెల్లం చేస్తుంది.

తదేకదీక్షతో జీవుడు చేసే స్మరణే దేవుని దగ్గర చేస్తుందని ఆమె నడవడిక స్పష్టపరుస్తుంది. ధర్మక్షేత్రంలోఎన్నటికీ చెరగని కాంతి రేఖ శబరి వైరాగ్యమార్గాన కోటి వెలుగుల శాంతిదీపం శబరి.

– వులాపు బాలకేశవులు

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/