నటుడు జయప్రకాశ్‌రెడ్డి కన్నుమూత

శోకసంద్రంలో తెలుగు చిత్ర పరిశ్రమ

jayaprakash-reddy


అమరావతి: ప్రముఖ సినీ నటుడు జయప్రకాశ్‌రెడ్డి (74) కన్నుమూశారు. మంగళవారం తెల్లవారు జామున గుండెపోటుతో బాత్‌రూమ్‌లోనే కుప్పకూలిన ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. కరోనా నేపథ్యంలో సినిమా షూటింగ్‌లు లేకపోవడంతో ప్రస్తుతం ఆయన గుంటూరులో నివాసం ఉంటున్నారు. జయప్రకాశ్ రెడ్డి స్వస్థలం కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలంలోని సిరివెళ్ల. 8 మే 1946లో జన్మించిన జయప్రకాశ్‌రెడ్డి వెంకటేశ్ నటించిన బ్రహ్మపుత్రుడు సినిమాతో తెలుగు చిత్ర సీమకు పరిచయమయ్యారు. అనంతరం సమరసింహారెడ్డి, నరసింహానాయుడు తదితర చిత్రాలతో తన విలనిజంతో ప్రేక్షకుల మదిలో నిలిచిపోయారు. రాయలసీమ యాసలో ప్రతినాయకుడిగా, కమెడియన్‌గా తనదైన ముద్ర వేశారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో లాక్‌డౌన్‌ విధించిన నాటిన నుంచి ఆయన గుంటూరు విద్యానగర్‌లోని నివాసంలోనే ఉంటున్నారు. జయప్రకాశ్ రెడ్డి మృతి విషయం తెలిసి తెలుగు చిత్రపరిశ్రమ విషాదంలో మునిగిపోయింది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/