‘ఆర్ఆర్ఆర్’ టికెట్ ధరల పెంపుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి

ఈ నెల 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతున్న ‘ఆర్ఆర్ఆర్’


హైదరాబాద్: ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. సాధారణ థియేటర్లలో తొలి మూడు రోజులకు రూ. 50, ఆ తర్వాత వారం రోజులకు రూ. 30 పెంచుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. అంతేకాదు ఐమ్యాక్స్ థియేటర్లు, స్పెషల్ కేటగిరీ థియేటర్లలో మొదటి మూడు రోజులు రూ. 100, ఆ తర్వాత వారం రోజులు రూ. 50 పెంచుకునే అవకాశాన్ని కల్పించింది.

కాగా, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో దర్శక దిగ్గజం రాజమౌళి తెరకెక్కించిన ప్రతిష్ఠాత్మక చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ విడుదలకు సిద్ధమైంది. ఈ నెల 25న ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం విడుదలవబోతోంది. రూ. 450 కోట్లతో ఈ చిత్రం తెరకెక్కినట్టు తెలుస్తోంది. ఈ చిత్రంలో అజయ్ దేవ్ గన్, అలియా భట్, ఒలీవియా మోరిస్, సముద్రఖని, శ్రియ తదితరులు ప్రధాన పాత్రలను పోషించారు. సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను ముమ్మరం చేసింది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/