చంద్రబాబును అరెస్ట్ చేయడం ఎందుకు సమర్థనీయం కాదో చెప్పాలిః రోజా

చంద్రబాబుకు ఇచ్చిన నోటీసులు, సెక్షన్లతో రోజా ట్వీట్

rk-roja-counter-to-purandeswari

అమరావతిః స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు అరెస్ట్ పద్ధతి ప్రకారం జరగలేదన్న బిజెపి ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరికి వైఎస్‌ఆర్‌సిపి నేత, మంత్రి ఆర్కే రోజా కౌంటర్ ఇచ్చారు. సోషల్ మీడియా అనుసంధాన వేదిక ఎక్స్ (ట్విట్టర్) ద్వారా ఏపీ బిజెపి అధ్యక్షురాలికి చురకలు అంటించారు. బిజెపిని మీ బావ జనతా పార్టీగా మార్చేశారని ఎద్దేవా చేశారు. చంద్రబాబుకు ఇచ్చిన నోటీసులు, సెక్షన్లు, ఏయే నేరాలు వర్తిస్తాయో ప్రస్తావిస్తూ ట్వీట్ చేశారు.

క్రైం నెంబర్ 29/2021 కింద అరెస్ట్, సీఆర్పీసీ 50(1)(2) సెక్షన్ కింద నోటీసులు, 9/12/2021 న సిఐడి ఈవోడబ్ల్యు వింగ్ ఎఫ్ఐఆర్ నమోదు, 120(బీ) నేరపూరితకుట్ర, సెక్షన్ 166,167 పబ్లిక్ సర్వెంట్ చట్టాన్ని ఉల్లంగించి నేరానికి పాల్పడటం, సెక్షన్ 418 తన అధికారాన్ని దుర్వినియోగం చేయటం, ఐపీసీ సెక్షన్ 420 మోసం, చీటింగ్, నమ్మక ద్రోహం, ఐపీసీ సెక్షన్ 465, 468 ఉద్దేశపూర్వకంగా మోసం కోసం ఫోర్జరీ, 471 నకిలీ పత్రాలు లేదా ఎలక్ట్రానిక్ రికార్డు సృష్టించడం, సెక్షన్ 409 పబ్లిక్ సర్వెంట్ తన ఆధీనంలోని ఆస్థిని అక్రమంగా కట్టబెట్టడం, 12,13(2) అవినీతికి పాల్పడటం, 13(1)(సీ)(డీ)పబ్లిక్ సర్వెంట్ అవినీతికి పాల్పడటం… వంటి వాటిని ప్రస్తావిస్తూ… ఇప్పుడు చెప్పండి.. చంద్రబాబు అరెస్ట్ చేయడం అరెస్ట్ ఎందుకు సమర్ధనీయం కాదో? అని పురందేశ్వరిని నిలదీశారు. ఏపీ బిజెపిని మీ బావ జనతా పార్టీగా మార్చేశారని ఎద్దేవా చేశారు.

అంతకుముందు కూడా ఓ ట్వీట్ చేశారు. కర్మ సిద్ధాంతం.. ఎవడినీ వదిలిపెట్టదని, చేసిన తప్పులకు అనుభవించాల్సిందేనని ట్వీట్ చేశారు.