ఉండవల్లి నివాసంలో న్యాయవాదులతో లోకేశ్ సమీక్ష

చంద్రబాబును ఎక్కడికి తరలిస్తే అక్కడికి వెళ్లాలని లోకేశ్ నిర్ణయం

Lokesh review with lawyers at Undavalli residence

అమరావతిః కోనసీమ జిల్లాలో యువగళం పాదయాత్ర చేపట్టిన టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్… పార్టీ అధినేత చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకున్నారు. చంద్రబాబును సీఐడీ పోలీసులు అరెస్ట్ చేసే సమయాలని లోకేశ్ కోనసీమ జిల్లా పొదలాడ క్యాంప్ సైట్ వద్ద ఉన్నారు. లోకేశ్ తన తండ్రి వద్దకు బయల్దేరడంతో పోలీసులు అడ్డుకోగా, ఉద్రికత్త ఏర్పడింది. లోకేశ్ అక్కడే బైఠాయించి నిరసన తెలిపారు.

కాగా, చంద్రబాబును నంద్యాల నుంచి సీఐడీ అధికారులు కుంచనపల్లి సిట్ కార్యాలయానికి తీసుకువస్తున్నట్టు తెలుస్తోంది. కుంచనపల్లి సిట్ కార్యాలయం వద్ద పోలీసులు వాహనాల రాకపోకలను నిలిపివేసి, భారీ భద్రత ఏర్పాటు చేశారు.

ఈ నేపథ్యంలో చంద్రబాబును ఎక్కడికి తీసుకువస్తే అక్కడికి వెళ్లాలని లోకేశ్ నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం ఉండవల్లిలోని నివాసంలో ఆయన న్యాయవాదులతో సమీక్షిస్తున్నారు. చంద్రబాబు అరెస్ట్ పై చర్చిస్తున్నారు.