నారా బ్రాహ్మణి కి వర్మ సలహా..

టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబును స్కిల్ కేసులో అరెస్ట్ చేసిన నేపథ్యంలో టీడీపీ పార్టీ ‘మోత మోగిద్దాం’ అంటూ వినూత్న కార్యాచరణకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. చంద్రబాబుకు మద్దతుగా ఐదు కోట్ల ఆంధ్రులు ఈ నెల 30వ తేదీ శనివారం రాత్రి 7 గంటల నుంచి 7.05 వరకు ఐదు నిమిషాల పాటు ఉన్న చోటే మోత మోగించి ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాశబ్దం వినిపిద్దామని పేర్కొన్నారు. ఇదే విషయాన్నీ నారా బ్రాహ్మణి ట్విట్టర్ (X) లో పేర్కొన్నారు.

దీనిపై వర్మ స్పందిస్తూ..నారా బ్రాహ్మణి కి ఓ సలహా అంటూ తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. “బ్రాహ్మణి గారూ… మీరు ఒక వర్ధమాన రాజకీయవేత్త. మీకు నేనిచ్చే చిన్న సలహా ఏంటంటే… మీరు ప్రజలపై ఎంత ప్రభావం చూపగలరు అనే అంశాన్ని పరీక్షించుకునేందుకు ఇలాంటి ప్రమాదకర ప్రతిపాదనలు చేయొద్దు. మీ ప్రతిపాదనను ఎవరూ పాటించకపోతే మీ రాజకీయ జీవితం షార్ట్ సర్క్యూట్ కు గురవుతుంది. విద్యుచ్ఛక్తి అనేది కాంతివంతంగా ఉండాలే తప్ప ఎప్పుడూ కనెక్ట్ కాకూడదు అని అయాన్ రాండ్ అన్నాడు” అంటూ వర్మ పోస్ట్ చేసాడు.

వైసీపీ మంత్రి రోజా కూడా చంద్రబాబు అవినీతి చేసి జైలుకు వెళ్తే, అలాంటి అవినీతిపరుడికి ప్రజల మద్దతును కోరడం ఏమిటని ప్రశ్నించారు. మంగళగిరిలో నీ భర్త లోకేశ్‌ను ప్రజలు ఓడించారని.. అయినా కోర్టులు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు జైల్లో పెడితే మీ మామకు మద్దతుగా ఆందోళన చేస్తావా? అని నారా బ్రాహ్మణి ని ఉద్దేశించి రోజా ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.