ట్విట్టర్ వేదికగా కేటీఆర్ – రేవంత్ ల మధ్య మాటల యుద్ధం

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గర పడుతుండడం తో బిఆర్ఎస్ – కాంగ్రెస్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ముఖ్యంగా రేవంత్ – కేటీఆర్ ల మధ్య వార్ నడుస్తుంది. సభల్లోనే కాదు ట్విట్టర్ వేదికగా కూడా ఇరువురు గట్టిగా వాదనలు చేసుకుంటున్నారు. కొత్త ప్రభావర్‌పై దాడి విషయంలో మంత్రి కేటీఆర్‌ ట్వీట్‌కు బదులుగా రేవంత్‌రెడ్డి ఘాటైన ట్వీట్ వేశారు.

కొత్త ప్రభాకర్ రెడ్డిపై కత్తితో దాడి చేసిన వ్యక్తిని దుబ్బాక నియోజకవర్గం చెప్యాలకు చెందిన గటని రాజుగా పోలీసులు గుర్తించారు. నిందితుడు కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తి అని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. ఇదే విషయంపై మంత్రి కేటీఆర్‌ ట్వీట్ చేశారు. ‘బీఆర్ఎస్ ఎంపీ ప్రభాకర్ రెడ్డిపై కాంగ్రెస్ గూండాలు దాడి చేశారంటూ ట్వీట్ చేశారు. తెలంగాణలో బీఆర్‌ఎస్‌ నాయకులను భౌతికంగా నిర్మూలించే ప్రయత్నాలను జరుగుతున్నాయంటూ ఆరోపించారు. నేరస్థుడిని టీపీసీసీ(TPCC) ప్రెసిడెంట్‌గా చేశారంటూ రేవంత్‌రెడ్డిపై విమర్శలు చేశారు కేటీఆర్‌.

కేటీఆర్ విమర్శలకు రేవంత్ ఘాటుగా స్పందించారు. కేసీఆర్ అంటేనే గజకర్ణ, గోకర్ణ, టక్కు టమార విద్యలకు మారు పేరని తెలంగాణ సమాజానికి అర్థమైపోయిందంటూ ట్వీట్ చేశారు. ఒక ఎంపీపై దాడి జరిగితే దానిని చిల్లర రాజకీయ ప్రయోజనాలకు వాడుకునే మీ కచరా ప్రయత్నం చూస్తుంటే బీఆర్ఎస్ ఓటమి ఖాయం ఐనట్టేనంటూ మండిపడ్డారు. ఈ సరికొత్త మొండి కత్తి డ్రామాను మీరు, మీ తండ్రి కలిసి రక్తి కట్టిస్తున్న వైనాన్ని తెలంగాణ సమాజం గమనిస్తోందని.. జరిగిన దుర్ఘటనను కాంగ్రెస్ కు అంటగట్టే మీ కుటిల నీతి ప్రజలకు అర్థమైందని ఆరోపించారు రేవంత్‌ రెడ్డి. ఏది ఏమైనా దాడిని ఖండిస్తున్నామని.. అహింసనే ఆయుధంగా చేసుకుని దేశానికి స్వాతంత్ర్యాన్ని సాధించిన కాంగ్రెస్ కు మీ తండ్రి లాంటి మరుగుజ్జును ఓడించడం పెద్ద లెక్క కాదంటూ ఫైర్ అయ్యారు.