ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళ్లు అర్పించిన నారా లోకేష్

టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఈ నెల 27 నుండి యువగళం పేరుతో పాదయాత్ర చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో లోకేష్…హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్దకు వెళ్లి తారకరామారావుకు నివాళి అర్పించారు. సీనియర్ నేత కంభంపాటి రామ్మోహన్ రావు, టీడీపీ తెలంగాణ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ తో కలిసి ఎన్టీఆర్ కు శ్రద్ధాంజలి ఘటించారు.

అంతకు ముందు జూబ్లీహిల్స్ లోని నివాసంలో తల్లిదండ్రులు చంద్రబాబు, భువనేశ్వరి… అత్తమామలు బాలకృష్ణ, వసుంధర పాదాలకు నమస్కరించి వారి ఆశీర్వాదాలను తీసుకున్నారు. ఈ సందర్భంగా లోకేశ్ ను తండ్రి చంద్రబాబు ఆప్యాయంగా హత్తుకున్నారు. తన భర్తకు నారా బ్రాహ్మణి తిలకం దిద్ది, హారతి ఇచ్చారు. అనంతరం లోకేశ్ ఎన్టీఆర్ ఘాట్ కు పయనమయ్యారు.

ఇక కాసేపట్లో లోకేష్ కడపకు చేరుకోనున్నారు. అక్కడ లక్ష్మీ వెంకటేశ్వరస్వామి ఆలయం, పెద్ద దర్గా, మరియాపురం చర్చిలను దర్శించుకోనున్నారు. గురువారం తిరుమల శ్రీవారిని కుటుంబసభ్యులతో కలిసి దర్శించుకోనున్నారు. ఎల్లుండి కుప్పం నుంచి లోకేష్ యువగళం పాదయాత్ర ప్రారంభిస్తారు. కాగా లోకేష్ పాదయాత్ర కోసం ప్రత్యేక కర్వాన్ వాహనం సిద్ధం చేశారు. పాదయాత్రలో విశ్రాంతి, పార్టీ నేతలతో సమీక్షల కోసం కార్వాన్‌లో అధునాతన ఏర్పాట్లు చేశారు. ఈరోజు కార్వాన్ వాహనం హైదరాబాద్ నుంచి కుప్పం బయలుదేరనుంది. లోకేష్ పర్యటనను విజయవంతం చేసేందుకు టీడీపీ శ్రేణులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.