ప్రజల ఆశీర్వాదం, నిరుద్యోగుల పోరాటం వల్లే తెలంగాణలో కాంగ్రెస్ గెలిచిందిః రేవంత్ రెడ్డి

ప్రజలలోకి వెళ్లి సేవ చేస్తే వారు తప్పకుండా ఆదరిస్తారన్న రేవంత్ రెడ్డి

CM Revanth Reddy

హైదరాబాద్‌ః డబ్బులుంటేనే రాజకీయం అనే ఆలోచనను పక్కన పెట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. హైదరాబాద్ బాగ్ లింగంపల్లిలోని బీఆర్ అంబేడ్కర్ కళాశాలలో… కాకా వెంకటస్వామి వర్ధంతి సందర్భంగా గ్రాడ్యుయేషన్ డే నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… తెలంగాణ ప్రజల ఆశీర్వాదం, నిరుద్యోగుల పోరాటం వల్లనే ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచిందన్నారు. డబ్బులు ఉంటేనే రాజకీయాలు చేయాలనే ఆలోచన సరికాదన్నారు. ప్రజలలోకి వెళ్లి సేవ చేస్తే వారు తప్పకుండా ఆదరిస్తారన్నారు. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు తాము అండగా ఉంటామన్నారు.

కాకా వర్ధంతి సందర్భంగా వెంకటస్వామి విగ్రహానికి… రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. వివేక్, వినోద్‌లను చూసినప్పుడు తనకు రామాయణంలో లవకుశులు గుర్తుకు వస్తారని చెప్పారు. దేశ నిర్మాణంలో కాకా సామాజిక బాధ్యతను నిర్వర్తించినట్లు చెప్పారు. కాకా వర్ధంతి రోజున గ్రాడ్యుయేషన్ డే నిర్వహించడం ప్రశంసనీయమన్నారు. తెలంగాణ ఉద్యమంలో కాకా కుటుంబం ముందు ఉందన్నారు. దేశానికి గాంధీ కుటుంబం ఎలాగో… తెలంగాణకు కాకా కుటుంబం అలాగే అన్నారు. అంతకుముందు కాలేజీలో కాకా విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు.