సింగర్‌ సునీత భర్తకు బెదిరింపులు..పోలీసులకు ఫిర్యాదు

వ్యక్తిగతంగా కలవాలంటూ రామ్ కు లక్ష్మణ్ అనే వ్యక్తి నుంచి మెసేజ్ లు

threat-messages-to-singer-sunitha-husband

హైదరాబాద్‌ః ప్రముఖ సినీ గాయని సునీత భర్త వీరపనేని రామ్ కు ఫోన్ ద్వారా బెదిరింపులు వచ్చాయి. దీంతో తనకు ప్రాణహాని ఉందంటూ ఆయన హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించారు. సునీత, రామ్ దంపతులు బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 2లోని ఉమెన్స్ కోఆపరేటివ్ సొసైటీలో నివాసం ఉంటున్నారు.

కాగా, కొన్ని రోజుల క్రితం ఆయనకు కేకే లక్ష్మణ్ అనే వ్యక్తి నుంచి మెసేజ్ వచ్చింది. తాను సినీ నిర్మాతల కౌన్సిల్ సభ్యుడినని, వ్యక్తిగతంగా కలవాలని భావిస్తున్నట్టు మెసేజ్ లో పేర్కొన్నాడు. అయితే, సదరు వ్యక్తి తనకు తెలియకపోవడంతో రామ్ స్పందించలేదు. ఏదైనా బిజినెస్ విషయం అయితే తన టీమ్ ను కలవాలని రిప్లై ఇచ్చారు. కానీ వ్యక్తిగతంగా కలవాలని ప్రతిరోజు మెసేజ్ లు పెడుతూ లక్ష్మణ్ విసిగించాడు. దీంతో ఆ నెంబర్ ను రామ్ బ్లాక్ చేశారు.

దీంతో, మార్చి 28న కొత్త నెంబర్ తో మెసేజ్ లు పంపడం ప్రారంభించాడు. అంతేకాదు బెదిరించడం కూడా ప్రారంభించాడు. ఈ నేపథ్యంతో తనకు, తన కుటుంబ సభ్యులకు లక్ష్మణ్ నుంచి ప్రాణ హాని ఉందంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.