కేటీఆర్‌పై రేవంత్ ఘాటు వ్యాఖ్యలు

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మరోసారి మంత్రి కేటీఆర్ ఫై ఘాటు వ్యాఖ్యలు చేసారు. ప్రస్తుతం తెలంగాణ TSPSC పేపర్ లీకేజ్ ఘటన సంచలనం రేపుతున్న సంగతి తెలిసిందే. దీనిపై మొదటి నుండి రేవంత్ రెడ్డి..ఈ లీకేజ్ తో కేటీఆర్ కు సంబంధాలు ఉన్నాయని ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. తాజాగా మరోసారి ఘాటైన వ్యాఖ్యలు చేసారు.

కేటీఆర్ కు నిజంగా పరువుంటే పేపర్ లీక్ కేసును సీబీఐకి అప్పగించాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. పేపర్ లీక్ కేసును ఈడీ దర్యాప్తు చేయాలని కాంగ్రెస్ నేతలు ఈడీ అధికారులకు ఫిర్యాదు చేశారు. పరువున్నోళ్లు పరువు నష్టం దావా వేయాలన్న రేవంత్.. కేటీఆర్ కు చీము నెత్తురుంటే పేపర్ లీక్ కేసును సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలంటూ లేఖ రాయాలన్నారు. కేటీఆర్ పరువుకు 100 కోట్లని ఆయన ఎలా నిర్ణయించాడని రేవంత్ ప్రశ్నించారు.

కేసుతో లింక్ ఉన్న ప్రభుత్వ పెద్దలను అమరవీరుల స్థూపం ముందు ఉరేసినా తప్పులేదన్నారు. ఇంత జరిగితే.. నిరుద్యోగులకు కేటీఆర్ క్షమాపణ చెప్పి పారదర్శక విచారణ చేయిస్తారనుకున్నామని.. కానీ సిట్‌తో కేసులు వేయించి తమ విద్యార్థి నాయకులను నిర్బంధించడం సిగ్గుచేటన్నారు. పేపర్ లీకేజీ వ్యవహారమే శంకరలక్ష్మి దగ్గర నుంచి మొదలైంది. ఏ1 గా శంకర లక్ష్మిని, ఏ2గా ఛైర్మన్, సెక్రెటరీలను పెట్టాలి. కేసులో కావాల్సిన వారిని కాపాడి చిన్న ఉద్యోగులను బలిచేసే ప్రయత్నం చేస్తున్నారు.

ఈ అంశంపై మేం ఇప్పటికే కోర్టును ఆశ్రయించాం. కోర్టులో కేసు విచారణ జరుగుతోంది. ఈడీ జాయింట్ డైరెక్టర్‌ను కలిసి ఫిర్యాదు చేశాం. 420, 120బీ సెక్షన్లు ఈడీ పరిధిలోకి వస్తాయి. కేటీఆర్‌తో సహా టీఎస్పీఎస్సీ అధికారులందరినీ విచారించాలని కోరాం. సిట్ కొద్ది మందినే విచారిస్తుందని మాకు సమాచారం ఉంది. పూర్తి సమాచారం సేకరించి విచారణ చేయాలని ఈడీ అధికారులను కోరినట్లు రేవంత్ రెడ్డి తెలిపారు.