రేవూరి ప్రకాష్ రెడ్డి నాకు పెద్దన్న – రేవంత్

తెలంగాణ ఎన్నికల ప్రచారంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తన దూకుడు కనపరుస్తున్నాడు. ఒంటిచేత్తో ప్రచారం చేస్తూ కాంగ్రెస్ కార్యకర్తల్లో జోష్ నింపుతున్నారు. గత కొద్దీ రోజులుగా బస్సు యాత్ర తో రాష్ట్రం మొత్తం చుట్టేస్తూ కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరుతూ వస్తున్నారు. రాష్ట్రంలో ఈసారి కాంగ్రెస్ గెలుపు ఖాయం అన్నట్లు పలు సర్వేలు చెపుతుండడం తో కాంగ్రెస్ నేతలు దూకుడు కనపరుస్తున్నారు.

ముఖ్యంగా రేవంత్ రెడ్డి ..కాంగ్రెస్ హామీలను ప్రజలకు వివరిస్తూనే..బిఆర్ఎస్ ఫై విమర్శలు కురిపిస్తూ వస్తున్నాడు. ఈరోజు వరంగల్ జిల్లా పరకాల కాంగ్రెస్​ విజయభేరి సభలో పాల్గొన్న రేవంత్..రేవూరి ప్రకాష్ రెడ్డి తనకు పెద్దన్న అని, మచ్చలేని నాయకుల్లో మొదటి వ్యక్తి రేవూరి ప్రకాశ్ రెడ్డి అంటూ ప్రశంసించారు. కొండా దంపతులు పరకాల నుండి వెళ్లిన తర్వాత కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టారని చెప్పారు. ఇన్నేళ్లు బీఆర్ఎస్ ఎమ్మెల్యే (చల్లా ధర్మారెడ్డి) అణిచివేతను తట్టుకున్నారని, కడుపులో పెట్టుకుని కాపాడే రేవూరి మీ కోసం వచ్చాడు అని అలాంటి వ్యక్తి ని భారీ మెజారిటీ తో గెలిపించాలని కోరారు. తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగిసేలా చేసిన ప్రాంతం పరకాల అని గుర్తు చేశారు. తెలంగాణ సిద్ధాంత కర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ జన్మస్థలం కూడా పరకాల అని చెప్పారు. ప్రత్యేక నిధులు ఇచ్చి పరకాలను పూర్తిగా అభివృద్ధి చేస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.