మహారాష్ట్ర లో ఆదిపురుష్ చిత్ర ప్రదర్శనను అడ్డుకుంటాం – బిజెపి నేత కీలక వ్యాఖ్యలు

ఆదిపురుష్ చిత్రాన్ని మహారాష్ట్రలో ప్రదర్శించనీయబోమని హెచ్చరించారు బీజేపీ ఎమ్మెల్యే రామ్ కదమ్. బహుబలి సినిమాతో దేశ వ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్న ప్రభాస్.. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీబిజీగా ఉన్నాడు. ప్రభాస్ అభిమానుల ఉత్సాహాన్ని చూసి అక్టోబర్ 2న ప్రభాస్ ‘ఆదిపురుష’ టీజర్, ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేసింది చిత్ర యూనిట్. అయితే ఓం రౌత్ దర్శకత్వం వహించిన పౌరాణిక సినిమా ‘ఆదిపురుష్’ టీజర్ మాత్రం జనాల అంచనాలను అందుకోలేకపోయింది. ‘ఆదిపురుష’ సినిమా సన్నివేశాల్లో ఎఫెక్టివ్ ఏమీ లేదని, టీజర్ ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ నుండి కాపీ చేయబడిందని కూడా కొందరు ఘాటుగానే కామెంట్స్ చేసారు. అంతే కాదు రామాయణం కథను కించపరిచే విధంగా తీసారని , దేవుళ్లు, దేవతలను చౌక ప్రచారం కోసం సినిమా నిర్మాతలు ఆదిపురుష్ సినిమాలో కించపరిచారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఈ తరుణంలో మహారాష్ట్రలో ఈ సినిమాను ప్రదర్శించనీయబోమని బీజేపీ ఎమ్మెల్యే రామ్ కదమ్ హెచ్చరించారు. ‘‘మరోసారి మా దేవుళ్లు, దేవతలను చౌక ప్రచారం కోసం సినిమా నిర్మాతలు ఆదిపురుష్ సినిమాలో కించపరిచారు. కోట్లాది మంది హిందువుల విశ్వాసాలను, మనోభావాలను గాయపరిచారు’’అని బీజేపీ ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. ‘‘ఈ విడత క్షమాపణలు చెప్పడమో, సదరు సీన్లను కత్తిరించడమో చేస్తే చాలదు. ఆ విధమైన ఆలోచనలకు గుణపాఠం చెప్పేందుకు వీలుగా, అటువంటి సినిమాలను పూర్తిగా నిషేధించాల్సిందే’’అని రామ్ కదమ్ డిమాండ్ చేశారు.