పేపర్ లీక్ లో బీఆర్ఎస్ పెద్ద తలకాయలు బయటకు రావాలి – రేవంత్ రెడ్డి

TSPSC పేపర్ లీక్ ఘటన తెలంగాణ వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ప్రస్తుతం పేపర్ లీక్ కేసులో నిందితులకు మార్చి 23 వరకు కస్టడీలో ఉన్న విషయం తెలిసిందే.. కాగా, టీఎస్ పీఎస్సీ కార్యాలయంలో నిందితులు ప్రవీణ్, రాజశేఖర్ ల విచారణ ముగిసింది. కార్యాలయంలోని రెండు సిస్టంలు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితులిద్దర్ని టీఎస్ పీఎస్సీ కార్యాలయం నుంచి సిట్ కార్యాలయానికి తరలించారు.

మరోపక్క ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు , ఆరోపణలు చేస్తున్నారు. ఈ తరుణంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ కేసులో చిన్న చిన్న వాళ్లను అరెస్ట్ చేయడం కాదని, ప్రశ్నాపత్రం లీకేజి వెనుక ఉన్న బీఆర్ఎస్ పెద్ద తలకాయలు బయటికి రావాలని అన్నారు. ఈ తతంగం వెనుక ఉన్న తిమింగలాలకు బహిరంగ శిక్ష విధించాలని పేర్కొన్నారు.

కామారెడ్డి జిల్లాలో హాత్ సే హాత్ జోడో యాత్ర సందర్భంగా రేవంత్ రెడ్డి రాజంపేట గ్రామంలో కార్నర్ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ సభలో ఆయన మాట్లాడుతూ, బీఆర్ఎస్ పైరవీకారులకు ముందే ప్రశ్నాపత్రాలు అందుతున్నాయని తెలిపారు. ఘటనకు బాధ్యుడైన మంత్రి కేటీఆర్ ను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. పేపర్ లీకేజ్ లో మంత్రి కేటీఆర్ పీఏ హస్తం ఉందని , కేటీఆర్ పీఏ సొంత  మండలం  కరీంనగర్ జిల్లా మాల్యాల మండలంలో 100  మందికి  గ్రూప్ 1 లో 100 కు పైగా మార్కులు వచ్చాయని.. దీనిపై పూర్తి విచారణ చేయాలన్నారు.

తాను ఐటీ మంత్రినని, ఈ వ్యవహారంతో తనకేంటి సంబంధం అని కేటీఆర్ అంటున్నారు… మరి ముఖ్యమంత్రి ఈ అంశంపై సమీక్ష జరిపితే నువ్వెందుకు హాజరయ్యావు? అని కేటీఆర్ ను నిలదీశారు. నీకేమీ సంబంధం లేకపోతే ఇవాళ ఒకవైపు విద్యాశాఖా మంత్రిని, మరోవైపు ఎక్సైజ్ శాఖామంత్రిని ఎందుకు కూర్చోబెట్టుకుని మాట్లాడావు? ఐటీ మంత్రివి అయిన నీవు అక్కడ మాట్లాడాల్సిన అవసరం ఏముంది? సమీక్ష సమావేశంలో సిట్ అధికారులను ఎందుకు కూర్చోబెట్టలేదు? అని ప్రశ్నించారు. ఈ కేసులో 9 మందిని అరెస్ట్ చేస్తే, ఇద్దరే నేరానికి పాల్పడ్డారని మంత్రిగా ఏ విధంగా ప్రకటన చేస్తారు? అని రేవంత్ రెడ్డి నిలదీశారు.

మార్చి 19న  ఎల్లారెడ్డిలోని గాంధారి మండల కేంద్రంలో నిరుద్యోగ దీక్ష చేస్తామని రేవంత్ అన్నారు.  ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు దీక్ష ఉంటుదన్నారు. 21న గవర్నర్ ను కలిసి పరిణామాలను వివరిస్తామన్నారు.