రేపు తిరువూరులో సీఎం జగన్ పర్యటన..

సీఎం జగన్ రేపు ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో పర్యటించబోతున్నారు. జగనన్న విద్యా దీవెన పథకం నిధుల విడుదల కార్యక్రమంలో సీఎం పాల్గొననున్నారు. జగనన్న విద్యా దీవెన పథకం నాలుగో విడత కింద రూ. 700 కోట్ల నిధులను లబ్ధిదారుల ఖాతాల్లోకి వేయనున్నారు. మొత్తం 11 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి బటన్ నొక్కి డబ్బులు జమ చేయనున్నారు.

జగన్ పర్యటనపై మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ.. జగన్ సీఎం అయిన తర్వాత విద్యా రంగంలో విప్లవాత్మకమైన మార్పును తీసుకొచ్చారని కొనియాడారు. కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ కాలేజీలను తీర్చిదిద్దారని చెప్పారు. ప్రభుత్వ విద్యను చంద్రబాబు నిర్వీర్యం చేశారని విమర్శించారు. చదువు ద్వారానే అన్నీ సాధ్యమనే విషయాన్ని నమ్మిన వ్యక్తి జగన్ అని తెలిపారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా… పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. మరోవైపు పార్టీ ముఖ్య నేతలు కూడా ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.

సీఎం జగన్ రేపు ఆదివారం ఉదయం 10.10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 10.35 గంటలకు తిరువూరు చేరుకుంటారు. 11.00 – 12.30 గంటలకు మార్కెట్‌ యార్డ్‌ సమీపంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని జగనన్న విద్యా దీవెన పథకం నిధులు విడుదల చేస్తారు. కార్యక్రమం అనంతరం మధ్యాహ్నం 1 గంటకు అక్కడి నుంచి బయలుదేరి 1.25 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.