హైదరాబాద్ లో భారీ వర్షం..లోతట్టు ప్రాంతాలు జలమయం

heavy rain in hyderabad

అల్ప పీడన ప్రభావం తో తెలంగాణ వ్యాప్తంగా రెండు రోజులుగా పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వడగండ్ల వానలు కురుస్తున్నాయి. మరో మూడు , నాల్గు రోజుల పాటు వర్షాలు పడనున్నాయని వాతావరణశాఖ తెలియజేసింది. ఈ క్రమంలో శనివారం సాయంత్రం హైదరాబాద్ లో భారీ వర్షం కురిసింది. రోడ్లు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రస్తుతం నగరంలో ఉరుములతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. పలు ప్రాంతాల్లో వడగండ్ల వాన పడుతోంది.

బోయిన్‌పల్లి, మారేడ్‌పల్లి, చిలుకలగూడ, బేగంపేట, ప్యాట్నీ, అల్వాల్‌, తిరుమలగిరి, కూకట్‌పల్లి, హైదర్‌నగర్‌, జీడిమెట్ల, ఆల్విన్‌ కాలనీ, బాచుపల్లి, నిజాంపేట, కాప్రా, ఈసీఐఎల్‌ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. మాదాపూర్‌, హైటెక్‌సిటీ, కుత్బుల్లాపూర్‌, జూబ్లీహిల్స్‌, బంజారాహిల్‌, పంజాగుట్టతో పాటు తదితర ప్రాంతాల్లో కొద్దిచోట్ల వానపడింది. పలుచోట్ల వడగళ్లు సైతం కురిశాయి. ఒక్కసారిగా వర్షం కురవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.

అలాగే ఏపీలోని అనేక జిల్లాల్లోనూ భారీగా వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని చోట్ల వడగళ్ల వాన కురుస్తోంది. వైజాగ్ , ఏలూరు జిల్లా చింతలపూడి మండలంలో వడగళ్ల వాన పడింది. అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గంలో వర్షం బీభత్సం సృష్టించింది. కాగా విశాఖలో రేపు (మార్చి 19) రెండో వన్డే జరిగే సూచనలు కనిపించడంలేదు. విశాఖలో రేపు ఉరుములతో కూడిన వర్షాలు పడొచ్చని వాతావరణ కేంద్రం చెప్పగా, ఈరోజు సాయంత్రం నుండే నగరంలో వర్షం పడడం స్టార్ట్ అయ్యింది. అటు, వన్డే మ్యాచ్ కోసం టీమిండియా, ఆస్ట్రేలియా జట్లు నగరానికి చేరుకున్నాయి.