ఈరోజు కర్ణాటకలో పర్యటించనున్న ప్రధాని మోడీ

శివమొగ్గ ఎయిర్‌పోర్టు సహా పలు ప్రాజెక్టులకు శ్రీకారం..

PM Modi to inaugurate Shivamogga airport in Karnataka today

న్యూఢిల్లీః ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈరోజు కర్ణాటకలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ శివమొగ్గ విమానాశ్రయాన్ని ప్రారంభించడంతోపాటు వేలాది కోట్ల అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించనున్నారు. మాజీ సీఎం యడ్యూరప్ప డ్రీమ్‌ ప్రాజెక్టుగా చెప్పుకునే శివమొగ్గ ఎయిర్‌పోర్టును ప్రధాని మోడీ నేడు లాంఛనంగా ప్రారంభిస్తారు. శివమొగ్గ ఎయిర్‌పోర్టును కమలం ఆకారంలో 450 కోట్లతో అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించారు. ఇది మల్నాడు ప్రాంతంలోని శివమొగ్గ, ఇతర పొరుగు ప్రాంతాలకు కనెక్టివిటీని మెరుగుపరుస్తుంది.

కాగా, శివమొగ్గ పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ శివమొగ్గ విమానాశ్రయంతోపాటు, రెండు రైల్వే ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు. శివమొగ్గ-శికారిపుర-రాణేబెన్నూరు కొత్త రైల్వే లైన్, కోటేగంగూరు రైల్వే కోచింగ్ డిపోలను ప్రారంభిస్తారు. ఈ కొత్త రైల్వే లైన్‌ను రూ. 990 కోట్లు కేటాయించగా.. కోటగంగూరు రైల్వే కోచింగ్ డిపో కోసం 100 కోట్లకుపైగా వ్యయంతో అభివృద్ధి చేయనున్నారు. ఈ పర్యటనలో ప్రధాని మోడీ 215 కోట్లకు పైగా వ్యయంతో నిర్మించిన బహుళ రహదారుల అభివృద్ధి ప్రాజెక్టులకు సైతం శంకుస్థాపన చేయనున్నారు. దీంతోపాటు మంత్రి జ‌ల్ జీవ‌న్ మిష‌న్ కింద 950 కోట్ల రూపాయ‌ల కంటే ఎక్కువ విలువైన బహుళ గ్రామాల ప‌థ‌కాల‌ను ప్రారంభించి, శంకుస్థాప‌న చేయ‌నున్నారు.