వరంగల్ నుంచి రాజస్థాన్ కు వెళ్లనున్న ప్రధాని

పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు

pm-narendra-modi-tour-in-3-non-bjp-states-within-two-days

న్యూఢిల్లీః ప్రధాని నరేంద్ర మోడీ బిజెపియేతర రాష్ట్రాలలో సుడిగాలి పర్యటన చేపట్టారు. శుక్రవారం ఛత్తీస్ గఢ్, ఉత్తరప్రదేశ్ లలో పర్యటించిన ప్రధాని.. శనివారం ఉదయం తెలంగాణలోని వరంగల్ కు చేరుకున్నారు. వరంగల్ లో పార్టీ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్న తర్వాత మధ్యాహ్నం రాజస్థాన్ కు బయలుదేరి వెళ్లనున్నారు. ఈ పర్యటనలలో ప్రధాని రూ.వేల కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, మరికొన్ని ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్ మినహా బిజెపియేతర పాలనలో ఉన్న రాష్ట్రాలలో ప్రధాని పర్యటించడం ప్రాధాన్యం సంతరించుకుంది.

ఛత్తీస్‌గఢ్ లో రూ.7,600 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్‌పూర్ వెళ్లి రెండు వందే భారత్ రైళ్ల ప్రారంభోత్సవం సహా పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. శనివారం ఉదయం వరంగల్ చేరుకున్న ప్రధాని.. కాజీపేటలో రైల్వే వ్యాగన్ల తయారీ ఫ్యాక్టరీకి భూమి పూజతో పాటు రూ.6,100 కోట్ల అభివృధి పనులకు శంకుస్థాపన చేస్తారు.

మధ్యాహ్నం రాజస్థాన్ కు చేరుకుని బికనీర్‌లో పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు. అమృత్‌సర్-జామ్‌నగర్ గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ వేను ప్రారంభిస్తారు. వందేభారత్ రైలుకు పచ్చ జెండా ఊపి ప్రారంభిస్తారు. నౌరంగ్‌దేసర్‌లో జరిగే బహిరంగ సభలో ప్రధాని ప్రసంగిస్తారు. రాజస్థాన్ లో రూ.25 వేల కోట్ల విలువైన పనులను ప్రధాని మోడీ ప్రారంభించి, భూమిపూజ చేయనున్నారు.