ఈ నెల 23 నుంచి వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్

తెలంగాణ సిఎం కెసిఆర్ నిర్ణయం

TS CM KCR
Telangana State Chief Minister K.Chandrasekhar Rao

Hyderabad: తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 23 నుంచి వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు నిర్ణయించారు.

ఇప్పటికే తన చేతుల మీదుగా ధరణి పోర్టల్ ప్రారంభం అయిన నేపథ్యంలో, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ వ్యవసాయేతర భూముల రిజిష్ట్రేషన్ ను లాంచ్ చేస్తారని సిఎం తెలిపారు.

ఆదివారం ప్రగతిభవన్ లో జరిగిన సమీక్షా సమావేశంలో సిఎం కెసిఆర్ ఇందుకు సంబంధించి ఉన్నతాధికారులతో చర్చించారు.

ధరణి పోర్టల్ ద్వారా ప్రభుత్వం ప్రారంభించిన వ్యవసాయ భూముల రిజిష్ట్రేషన్ ప్రక్రియ ప్రజల ఆదరణ పొందుతున్నది. అద్భుతమైన ప్రతిస్పందన వస్తోందని అన్నారు. భూ రిజిష్ట్రేషన్ ప్రక్రియలో చారిత్రక శకం ఆరంభమైనట్టుగా తెలంగాణ ప్రజలు భావిస్తున్నారని అన్నారు.

ధరణిద్వారా వారి వ్యవసాయ భూములకు భరోసా దొరికిందనే సంతృప్తిని నిశ్చింతను వ్యక్తం చేస్తున్నారని అన్నారు.

ఎక్కడి సమస్యలు అక్కడ చక్కబడిన తర్వాతే వ్యవసాయేతర భూముల రిజిష్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించాలను కున్నామని అన్నారు.

అందుకే కొన్ని రోజులు వేచి చూశామని, నవంబర్ 23 సోమవారం నాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ వ్యవసాయేతర భూముల రిజిష్ట్రేషన్ ప్రక్రియను లాంచ్ చేస్తారని అన్నారు

ధరణి పోర్టల్ అద్భుతంగా తీర్చిదిద్దినందుకు అధికారులను మనస్పూర్తిగ అభినందిస్తున్నానని సిఎం అన్నారు.

సమావేశంలో మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్.. సబితా ఇంద్రారెడ్డి, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షులు ఎమ్మెల్సీ, పల్లా రాజేశ్వర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్., సిఎం ముఖ్యకార్యదర్శి నర్సింగరావు , రెవిన్యూ శాఖ కార్యదర్శి శేషాద్రి, ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, సిఎంవో అధికారులు, ఎంఏయుడీ డైరక్టర్ సత్యనారాయణ, పంచాయితీ రాజ్ కమీషనర్ రఘునందన్ రావు తదితరులు పాల్గొన్నారు.

తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/